రసవత్తరంగా మారిన చొప్పదండి రాజకీయాలు

x
Highlights

చొప్పదండి రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ భూమారెడ్డి తీరును వ్యతిరేకించిన ఎంపీటీసీలు తిరుగుబావుటా ఎగురవేశారు. 11 మంది...

చొప్పదండి రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ భూమారెడ్డి తీరును వ్యతిరేకించిన ఎంపీటీసీలు తిరుగుబావుటా ఎగురవేశారు. 11 మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆగ్రహించిన అధికార పక్షం ఎలాగైనా అధికార పీఠాన్ని తిరిగి దక్కించుకునేందుకు బెదిరింపులకు దిగింది. ఎంపీటీసీలు తలదాచుకున్న శిబిరంపై పోలీసులతో దాడికి దిగింది. ఎంపీటీసీలను భయబ్రాంతులకు గురిచేసి, వారిపై అక్రమ కేసులు బనాయించారు. దీంతో తమకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు బాధిత ఎంపీటీసీలు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీ భూమారెడ్డిపై గత నెల 24న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అక్కడి ఎంపీటీసీలు. ఆ తర్వాత వారంతా హైదరాబాద్ చేరుకుని ఓ హోటల్‌లో బస ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 16న అవిశ్వాసంపై ఓటింగ్ ఉండటంతో అప్పటి దాకా అంతా ఒకే చోట ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఎలాగైనా వారి అవిశ్వాసం వీగిపోయేందుకు వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు ఎంపీపీ భూమారెడ్డి. అందులో భాగంగా చిట్యాలపల్లి ఎంపీటీసీ మంగను ప్రలోభానికి గురిచేసిన భూమారెడ్డి ఆమె భర్తతోనే మరో ముగ్గురిపై ఎంపీటీసీలపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో అక్రమ కేసులు పెట్టించాడు. తనకు వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాసాన్ని వెనక్కి తీసుకోకపోతే మిగిలిన వారిపైనా కేసులు పెట్టిస్తానని బెదిరించాడు. అయినా ఎంపీటీసీలు లొంగకపోవడంతో స్థానిక పోలీసులను వెంటబెట్టుకొచ్చి హైదరాబాద్‌లో క్యాంప్‌లో ఉన్న ఎంపీటీసీలపై మంగళవారం అర్ధరాత్రి దౌర్జన్యానికి దిగాడు. చొప్పదండి సిఐ ఆధ్వర్యంలో ఎలిగెటి తిరుపతి, మునిగాల చందులను బలవంతంగా అరెస్టు చేయించాడు. హైదరాబాద్‌ క్యాంప్‌ నుంచి ఇద్దరిని బలవంతంగా తీసుకెళ్లడంతో మిగిలిన ఎంపీటీసీలు చొప్పదండి ఎంపీపీ భూమారెడ్డి నుంచి తమకు రక్షణ కల్పించాలని మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. కనీసం మహిళలమని కూడా చూడకుండా ఎంపీపీ భూమారెడ్డి వ్యవహరిస్తున్నాడని, తమ పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీపీ తీరుపై ఎలక్షన్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామని, ఈనెల 16న ఎంపీపీ ఆఫీస్ లో ఓటింగ్ కోసం అడుగుపెట్టే వరకు తమకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, మాదాపూర్ పోలీసులు మాత్రం వారిపై స్థానికంగా కేసులు నమోదు కావడం వల్లే పోలీసులు వచ్చి తీసుకెళ్లారని చెబుతున్నారు. ఎంపీటీసీలు చెప్పినట్టు ఎవరూ కిడ్నాప్ చేయలేదని, మిగిలిన ఎంపీటీసీలు కూడా చొప్పదండికి వెళ్లిపోతే బాగుంటుందన్నట్టుగా సలహా ఇస్తున్నారు. ఇక అక్కడి పోలీసులేమో ఎంపీటీసీ మంగ భర్త ఫిర్యాదు మేరకే వారిని అరెస్టు చేశామని అంటున్నారు. పోలీసుల తీరు చూసిన బాధితులు.. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ కావడంతో ఆయనకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి ఈ ఎంపీటీసీల అవిశ్వాస తీర్మానం ఆఖరికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories