హోదా కోసం బాబు ధర్మ పోరాటం

హోదా కోసం బాబు ధర్మ పోరాటం
x
Highlights

ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ సీఎం చంద్రబాబు దీక్షకు దిగారు. తన పుట్టిన రోజున ధర్మపోరాట దీక్ష పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలోని...

ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ సీఎం చంద్రబాబు దీక్షకు దిగారు. తన పుట్టిన రోజున ధర్మపోరాట దీక్ష పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తున్నారు.

దీక్షా స్థలిపై ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్‌ చిత్ర పటాలకు పూలమాల వేసి చంద్రబాబు దీక్ష ప్రారంభించారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లెపూ దండ’ గీతాన్ని ఆలపించారు. ఈ దీక్షలో చంద్రబాబుతో పాటు మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమా, నారా లోకేశ్‌, కొల్లు రవీంద్ర, ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన చంద్రబాబు దీక్ష రాత్రి ఏడింటి వరకు కొనసాగనుంది.

ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని అంశాల అమలు కోసమే దీక్ష చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించకుండా, దీక్షల ద్వారా అందరూ కేంద్రంపై ధర్మాగ్రహం ప్రకటించాలని పిలుపునిచ్చారు. 68ఏళ్ల వయసులో దీక్షకు దిగిన చంద్రబాబుకు వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. బాబు దీక్షకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు, వివిధ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు నిర్వహిస్తున్నాయి. ఏ జిల్లాకు చెందిన మంత్రుల్ని ఆ జిల్లాలోనే దీక్షల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబు సూచించారు.

దీక్ష నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రజలకు లేఖ రాశారు. "కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, వంచనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేస్తున్నాను’’ అని లేఖలోపేర్కొన్నారు. తన పోరాటానికి కలసి రావాలని, దీక్షలో పాల్గొనాలని కోరుతూ అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, సంస్థలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళావెంకటరావు లేఖలు రాశారు. వైసీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాలు సహా అన్ని పార్టీలు, సంఘాలకు ఈ లేఖలు పంపారు. ముఖ్య నాయకులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫోన్లుచేసి సమాచారం అందజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, వాణిజ్య సంఘాలు, ప్రజాసంఘాలు, వివిధ సంస్థలు, యూనియన్లు ముఖ్యమంత్రి దీక్షకు మద్దతు ప్రకటించాయి. రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు పెద్దఎత్తున దీక్షకు హాజరై చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories