రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్రం ఓకే

x
Highlights

తెలంగాణ సీఎం కలల ప్రాజెక్ట్ రీజినల్ రింగ్ రోడ్డు కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ నాలుగు వరుసల్లో రీజినల్ రింగ్ రోడ్డు...

తెలంగాణ సీఎం కలల ప్రాజెక్ట్ రీజినల్ రింగ్ రోడ్డు కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ నాలుగు వరుసల్లో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞ‌ప్తి మేరకు భూసేకరణ ప్రారంభించుకోవచ్చని తెలంగాణ సర్కార్‌కు కేంద్రం సూచించింది. 334కిలోమీటర్ల పొడవున 11వేల కోట్ల వ్యయంతో రెండు దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే 12 ప్రాంతాలకు మహర్దశ పట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం 11వేల కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీజనల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు పరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మరో కీలక అనుమతి లభించింది. ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు ఆమోదం తెలుపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ చుట్టూ నాలుగు వరుసల రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ఈ ఏడాది ఆగస్టు 7న కేంద్రం అనుమతి మంజూరు చేసింది. సుమారు 334 కిలోమీటర్ల పొడవైన ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణ పనులు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరుగనుంది.

వాస్తవానికి ఈ ప్రాజెక్టు కార్యరూపమిచ్చేందుకు ఆరునెలలుగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తూనే ఉంది. తాజాగా మరోసారి టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని సంప్రదించారు. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అధికారులతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని ఎంపీలకు గడ్కరీ స్పష్టం చేశారు. దీంతో సీఎం కేసీఆర్‌ వేగంగా స్పందించారు. భూసేకరణకు అంగీకారం తెలుపుతూ మూడురోజుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర సర్కారు పంపిన డీపీఆర్‌కు స్వల్ప మార్పులతో కేంద్రం ఆమోదించినట్లు తెలిసింది.

సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-జగదేవ్‌పూర్‌-భువనగిరి-చౌటుప్పల్‌-ఇబ్రహీంపట్నం-చేవెళ్ల-శంకరపల్లి- యాచారం-కడ్డాల్‌-షాద్‌నగర్‌-కంది మీదుగా మళ్లీ సంగారెడ్డి వరకు జాతీయ రహదార్లను కలుపుతూ నిర్మించే రీజనల్‌ రింగ్‌రోడ్డుకు 11వేల కోట్లతో రాష్ట్రప్రభుత్వం డీపీఆర్‌ సిద్ధం చేసింది. ఇందులో 70 కిలోమీటర్లకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, 263 కిలోమీటర్లకు అయ్యే వ్యయాన్ని కేంద్రం భరిస్తాయి. రీజనల్‌ రింగ్‌రోడ్డులో మొత్తం 17 చోట్ల వేరే రోడ్లను కలుపుతారు. ప్రధానంగా 15 బైపాస్‌లు ఉంటారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నర్సాపూర్‌ నుంచి కంది వరకు 12 ప్రాంతాలకు మహర్దశ పట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories