వాట్సాప్‌కు కేంద్రం హెచ్చరిక

వాట్సాప్‌కు కేంద్రం హెచ్చరిక
x
Highlights

వాట్సాప్ వచ్చాక కమ్యూనికేషన్ మరింత తేలికైంది అయితే అంతే తేలికగా తప్పుడు సమాచారం వ్యాపిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వదంతులతో దేశవ్యాప్తంగా...

వాట్సాప్ వచ్చాక కమ్యూనికేషన్ మరింత తేలికైంది అయితే అంతే తేలికగా తప్పుడు సమాచారం వ్యాపిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వదంతులతో దేశవ్యాప్తంగా అమాయకుల్ని కిడ్నాపర్లుగా భావించి కొట్టి చంపుతున్న ఘటనలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేయడంతో వాట్సాప్ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇకపై పుకార్లు తేలిగ్గా వ్యాప్తి చేయకుండా కట్టడి చేసేలా చర్యలు తీసుకుంటామని వాట్సాప్ కేంద్రానికి సమాధానం చెప్పింది. ఇంతకీ పుకార్ల వ్యాప్తి అరికట్టేందుకు వాట్సాప్ ఏం చేయబోతోంది.

వాట్సాప్ మెసేజింగ్ సేవల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో కేంద్ర ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. బాధ్యతారహితమైన మెసేజ్‌ల వ్యాప్తిని అడ్డుకొనేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఒక స్వచ్ఛంద సంస్థ రూపొందించిన కిడ్నాప్‌ వీడియోను కొందరు ఎడిట్‌ చేసి, నిజమైన కిడ్నా్‌పగా పేర్కొంటూ షేర్‌ చేయడంతో అది వైరల్‌ అయ్యింది. దేశవ్యాప్తంగా 29 మంది హత్యకు గురయ్యారు. మహారాష్ట్రలో అమాయకులైన ఐదుగురిని వాట్సాప్‌ వీడియోలు చూసి చంపడం తో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు వాట్సాప్‌ సమాధానం ఇచ్చింది. ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్ తో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు తాను తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి వివరించింది. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం, వదంతులను ప్రభుత్వాలు, పౌర సమాజం, ఐటీ సంస్థలు కలిసికట్టుగా పని చేయడం ద్వారా ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. వదంతుల వ్యాప్తిని అరికట్టడానికి ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపింది.

సమాచారంపై నియంత్రణ ప్రజలకు అప్పగించడం ఒక పద్ధతయితే దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం మరో పద్ధతి. మెసేజ్ వచ్చినప్పుడు అది సరైందో కాదో గ్రూప్ అడ్మిన్ నిర్దారించుకున్న తర్వాతే మిగిలిన గ్రూప్ మెంబర్స్ కు వెళ్లేలా నియంత్రించే వ్యవస్థను త్వరలో ప్రవేశపెడతామని తెలిపింది. ఈ ఆప్షన్ సాయంతో తప్పుడు వార్తల వ్యాప్తిని నిరోధిస్తామని వాట్సాప్‌ తెలిపింది.

అంతేకాదు ఓ మెసేజ్ వచ్చినప్పుడు అది మరొకరి నుంచి వచ్చిన సమాచారాన్ని ఫార్వార్డ్ చేశారా లేదంటే స్వయంగా టైప్ చేసి పంపారా కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించనుంది. దీని వల్ల అది తప్పుడు సమాచారం అని తెలిస్తే మిగిలిన సభ్యులకు ఫార్వార్డ్ చేయకుండా నియంత్రించ వచ్చని తెలిపింది. పోలీసులు చట్టబద్ధమైన కారణాలతో అడిగినపుడు దర్యాప్తులో సహకరిస్తున్నామని చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories