కలకలం రేపిన సీఈసీ రావత్ వ్యాఖ్యలు...కేసీఆర్ తీరుపై రావత్ అసహనం

x
Highlights

తెలంగాణలో అసెంబ్లీ రద్దు కావడంతో ఇప్పుడు చర్చంతా ముందస్తు ఎన్నికలపైనే నడుస్తోంది. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్‌ఎస్ ఎన్నికల సంఘం నిర్ణయం కోసం...

తెలంగాణలో అసెంబ్లీ రద్దు కావడంతో ఇప్పుడు చర్చంతా ముందస్తు ఎన్నికలపైనే నడుస్తోంది. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్‌ఎస్ ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. టీఆర్‌ఎస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఈసీ అసలు ఏం నిర్ణయం తీసుకోబోతోందన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతున్నాయి.


తెలంగాణకు నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు నిర్వహించే అవకాశాలను ఇప్పుడే చెప్పలేమన్న సీఈసీ రావత్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. రావత్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఈసీ సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి కాదన్నది ఈసీ అభిప్రాయంగా కనిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ రద్దు అయినట్టు తమకు సమాచారం అందిందన్న రావత్ యంత్రాంగం సన్నద్ధత ఆధారంగా ఎన్నికలకు వెళ్తామన్నారు. ప్రభుత్వం రద్దయిన ఆర్నెల్లలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిందని, ఆ సూచనలకు అనుగుణంగానే తాము చర్యలు చేపడుతున్నామని ఆయన గుర్తు చేశారు. తదుపరి చర్యలపై నివేదిక పంపాలని తెలంగాణ ఎన్నికల అధికారిని కోరినట్టు చెప్పారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరోవైపపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన రావత్ జాతకాల ప్రకారం ముందస్తు ఎన్నికలు జరగవని చెప్పారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ఎన్నికల షెడ్యూల్‌పై ఎవరూ వ్యాఖ్యలు చేయొద్దని, నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

అయితే, ఎన్నికల షెడ్యూల్‌ ఈసీ మాత్రమే ప్రకటించాలని, కేసీఆర్‌ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్‌ను కలిసిన ఆయన ఎన్నికలు ఎప్పుడు జరగాలో ఈసీ నిర్ణయిస్తుందన్నారు. విపక్ష నేతలను సన్నాసులు అని తిట్టే కుసంస్కారి కేసీఆర్‌ అని ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ నెల 11న సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతినిధి బృందం హైదరాబాద్ రానుంది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ముందస్తుకు వెళ్లాలని టీఆర్ఎస్‌ ఆశపడుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి చేసిన వ్యాఖ్యలు కలవరపెడుతున్నాయి. మరి ముందస్తుపై ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories