ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
x
Highlights

ట్రిపుల్ తలాక్ చెబితే ఇకపై నేరంగా పరిగణిస్తారు. ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరమని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది....

ట్రిపుల్ తలాక్ చెబితే ఇకపై నేరంగా పరిగణిస్తారు. ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరమని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. మూడుసార్లు తలాక్ చెప్పిన వ్యక్తికి మూడేళ్ళ జైలుతో పాటు భార్యకు భరణం ఇచ్చేలా అత్యవసర చట్టాన్ని తెచ్చారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పేర్కొనే ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడంతో కొత్త చట్టం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ట్రిపుల్ తలాక్ చట్టం కింద అరెస్టయిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. అరెస్ట‌యిన వ్య‌క్తికి మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్ పొందే అవ‌కాశం ఉంది. అయితే భార్య వాద‌న‌లు విన్న త‌ర్వాతే బెయిల్‌పై నిర్ణ‌యం తీసుకోవాలనే నిబంధన విధించారు. అలాగే విడాకులు ఇచ్చిన భర్త భార్య‌కు భ‌ర‌ణం ఇచ్చేలా ఆర్డినెన్స్‌ రూపొందించారు. అలాగే భార్య‌, ర‌క్త‌సంబంధీకులు, స్నేహితులు మాత్ర‌మే భర్తపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే భార్య స‌మ్మ‌తితో భర్త రాజీ కుదుర్చుకునే అవ‌కాశం ఉంది.

ముమ్మారు తలాక్‌ను నేరంగా పరిగణించేలా తీసుకొచ్చిన బిల్లు 2017 డిసెంబరులో లోక్‌సభ ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం లేకపోవడం, పార్టీల మ‌ధ్య కుద‌ర‌ని ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల సమయంలో రాజ్యసభలో చర్చకు తీసుకురావాలని భావించినా అప్పుడు కూడా కుదరలేదు. ఈ బిల్లులో సవరణలు చేయాలని కాంగ్రెస్‌ మినహా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో విపక్షాలను సంతృప్తి పరిచేలా ఈ బిల్లులో మూడు కీలక సవరణలు చేశారు.

ముస్లిం మ‌హిళ‌లకు న్యాయం చేసేందుకే ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తెచ్చామని కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర ప్ర‌సాద్ అన్నారు. ఓటు బ్యాంకు రాజ‌కీయాల వల్లే తలాక్ బిల్లుకు విపక్షాలు మ‌ద్ద‌తివ్వాలేదని విమర్శించారు. ట్రిపుల్ తలాక్‌ చట్టం వల్ల ముస్లింల ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. విడాకుల కేసులో నామ్ ముస్లింలకు ఏడాది జైలు శిక్ష విధిస్తుంటే ముస్లింలకు మాత్రం మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తామని చెప్పడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని అసదుద్దీన్ చెప్పారు. అసదుద్దీన్ వ్యాఖ్యలు చూస్తే ట్రిపుల్ తలాక్ వ్యవహారం మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories