విషాదం నుంచి ఇంకా తేరుకోని నగరం గ్రామం..

విషాదం నుంచి ఇంకా తేరుకోని నగరం గ్రామం..
x
Highlights

కోనసీమకే తలమానికంగా నిలిచింది రాజోలు దీవి. అలాంటి ఆహ్లాదకరమైన ప్రాంతం... ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల విషపు కోరల్లో చిక్కుకుంటోంది. తరచూ జరుగుతున్న గ్యాస్...

కోనసీమకే తలమానికంగా నిలిచింది రాజోలు దీవి. అలాంటి ఆహ్లాదకరమైన ప్రాంతం... ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల విషపు కోరల్లో చిక్కుకుంటోంది. తరచూ జరుగుతున్న గ్యాస్ లీకేజీలు స్థానిక ప్రజలకు దినదిన గండంగా మారుతున్నాయి. ఐదేళ్ల క్రితం జరిగిన పెను విషాద ఘటన సందర్భంగా గెయిల్ సంస్థ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. దీంతో ఆ సంస్థ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నగరం గ్రామం కనిపిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లాలోని నగరం గ్రామం ఇంకా విషాదం నుంచి తేరుకోలేదు. అక్కడ ఐదేళ్ల క్రితం జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదం స్థానికులను కలవరపెడుతోంది. గెయిల్ సంస్థ చరిత్రలోనే అత్యంత భారీ విస్పోటనంగా ఈ సంఘటన నిలిచింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్ధంతో పేలుడు సంభవించి ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు గ్రామాన్ని చుట్టుముట్టాయి. ఇది జరిగి ఐదేళ్లైనా.. నాటి విషాద స్మృతులతో జనం హడలిపోతున్నారు. అయితే, ప్రమాదం జరిగిన అనంతరం బాధితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో దిగొచ్చిన గెయిల్ సంస్థ నగరం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది. అప్పట్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చకపోవడంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

నగరం దీవిలోని నదీ పాయలు, సముద్ర తీరం వెంబడి దాదాపు 60 వరకూ చమురు, సహజ వాయువు నిక్షేపాలను సరఫరా చేసే బావులున్నాయి. ఈ ప్రాంతంలోని పలు బావుల నుంచి జీసీఎస్, జీజీఎస్ ల వరకు వేసిన పైపులైన్లు 25 నుంచి 30 సంవత్సరాల కిందటివి కావడంతో తరచూ దెబ్బతింటున్నాయి. రాజోలు దీవిలో ఏటా సుమారు 40 నుంచి 60 చోట్ల గ్యాస్ పైపు లైను లీకేజీలు ఏర్పడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నగరం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ ఆవరణలో పైర్ ఫిట్ వద్ద నిత్యం మండించే వేస్ట్ గ్యాస్ వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెయిల్ సంస్థ ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి, ఘోర ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్థానికులు కోరుతున్నారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories