కలకలం రేపుతున్న సీఐ వాట్సాప్‌ మెసేజ్‌

కలకలం రేపుతున్న సీఐ వాట్సాప్‌ మెసేజ్‌
x
Highlights

ఆయనో సర్కిల్ ఇన్స్ పెక్టర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్సీ. త్వరలో పదోన్నతి రేసులో కూడా ఉన్నారు. అయితే తాను వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ పోస్టింగ్ పెట్టి...

ఆయనో సర్కిల్ ఇన్స్ పెక్టర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్సీ. త్వరలో పదోన్నతి రేసులో కూడా ఉన్నారు. అయితే తాను వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ పోస్టింగ్ పెట్టి పోలీసు శాఖలో కలకలం సృష్టించారు. బలిదానం తప్పదేమోనంటూ పోలీస్ శాఖ వాట్స్ ప్ గ్రూపులో పెట్టిన పోస్టింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ స్ధాయి అధికారికే వేధింపులు ఉంటే కిందిస్ధాయి ఉద్యోగుల పరిస్ధితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ సీఐ ఎవరు? ఆ వేధింపులేంటి?

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రుద్రూరు సీఐ దామోదర్ రెడ్డి పోలీస్ వాట్సప్ గ్రూపులో పెట్టిన మెసేజ్‌ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. 30 ఏళ్లుగా పోలీస్ శాఖలో ఉన్న దామోదర్ రెడ్డి.. ప్రతిక్షణం వేధింపులతో బతకడం కంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిదనిపిస్తోందని నా చావు అయినా కొందరు అధికారుల కళ్లు తెరిపిస్తే ఈ జన్మకు సార్ధకత ఉంటుందంటూ ఆ పోస్ట్‌లో తన ఆవేదన చెప్పుకొచ్చారు. సీఐ పెట్టిన పోస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సీఐను తక్షణం సెలవులోకి వెళ్లాలని ఆదేశించారు. ఎస్కార్ట్ పోలీసు వాహనంలో ఆయనను హైదరాబాద్‌లోని తన ఇంటికి పంపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా దామోదర్‌రెడ్డిని వేధిస్తున్న ఆ ఉన్నతాధికారి ఎవరన్నది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.

రుద్రూరు సీఐ దామోదర్ రెడ్డి పెట్టిన మెసేజ్‌తో పోలీస్ శాఖలో వేధింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 30ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న సీఐకే తట్టుకోలేని స్థాయిలో వేధింపులు ఉంటే కిందిస్ధాయి సిబ్బంది పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. బలిదానం తప్పదేమోననే బలహీన క్షణాలు భయపెడుతున్నాయంటూ సాక్ష్యాత్తు ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ మెసేజ్ పెట్టడం, పోలీస్ శాఖను కుదిపేస్తోంది. దాంతో సీఐ పోస్ట్‌పై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు దగ్గరవుతున్న పోలీసులు తమ శాఖలోని సొంత ఉద్యోగులను వేధిస్తున్నారనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసులను చూసి ప్రజలు భయపడే రోజులు పోయి పోలీసులే పోలీసులను చూసి భయపడే రోజులు వస్తుండటం ఆందోళన కలిగించే అంశమే.


Show Full Article
Print Article
Next Story
More Stories