బ్రహ్మోత్సవాల వెనుకున్న అసలు చరిత్ర ఏంటి...బ్రహ్మోత్సవాలు ఎప్పట్నుంచి జరుగుతున్నాయి?

x
Highlights

తిరులేశుని సన్నిధి... బ్రహ్మోత్సవ సంబరాలకు ముస్తాబవుతోంది. ఏడాది పొడవునా ఉత్సవాలు, ఊరేగింపులతో భక్తకోటిని అనుగ్రహించే శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి...

తిరులేశుని సన్నిధి... బ్రహ్మోత్సవ సంబరాలకు ముస్తాబవుతోంది. ఏడాది పొడవునా ఉత్సవాలు, ఊరేగింపులతో భక్తకోటిని అనుగ్రహించే శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే బ్రహ్మోవత్సవాలంటే ఎందుకింతటి విశిష్టతో మీకు తెలుసా? ఆ లక్ష్మీవల్లభుడైన శ్రీమన్నారాయణుడికి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం వెనుక వాస్తవ చరిత్ర ఏంటి? అసలు ఇంతకీ తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలు ఎప్పట్నుంచి జరుగుతున్నాయి. 9రోజులపాటు జరిగే ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు ఎలా వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవ చరిత్రపై hmtv ప్రత్యేక కథనం.

శ్రీమహావిష్ణువుపై అలకతో వైకుంఠం విడిచి భూలోకం వచ్చేసిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చిన విష్ణుమూర్తి సప్తగిరుల్లోని వారాహ క్షేత్రానికి సమీపంలోని ఎత్తైన కొండపైన మొదటగా కాలుమోపినట్లు పురాణాలు ద్వారా తెలుస్తొంది. అలా 17 కోట్ల సంవత్సరాలకు పూర్వం వైకుంఠం విడిచి భూలోకానికి చేరుకున్న మహావిష్ణువు శ్రీవేంకటేశ్వరస్వామి అవతారంలో అర్చవాతారమూర్తిగా సాలిగ్రామ శిలారూపంగా వెలసినట్లు తిరుమల స్థలపురాణం చెబుతోంది. అలా స్వామివారు ఏడుకొండలపై శ్రీనివాసుడిగా వెలసిన శుభముహుర్తాన్ని పురస్కరించుకొని అవతారోత్సవాలుగా ప్రతి ఏటా శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు చెబుతున్నారు.

సాక్షాత్తూ బ్రహ్మాదేవుడు దివి నుంచి భువికి దిగివచ్చి ముందుండి నడిపించే ఉత్సవాలు కాబట్టే వీటిని బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. ప్రతి ఏటా సౌరమానం ప్రకారం కన్యామాసంలో, చంద్రమానం ప్రకారం అశ్వీయుజ మాసంలో స్వామివారు తిరుమల క్షేత్రంపై అడుగుపెట్టిన శ్రావణ నక్షత్రం రోజుతో ముగిసే విధంగా 9రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారు భూలోకంలో వేంకటేశ్వరస్వామిగా అవతరించి సమస్త భూమండలానికి అధిపతియై ఎల్లవేళలా రక్షిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి గొప్ప తిరుమల పుణ్యక్షేత్రంలో వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. వీటిలో స్వామివారి ఆవిర్భావానికి సూచికగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు చాలా ప్రత్యేకమైనవని, బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వల్ల స్వామివారి శక్తి తేజోవంతమై మరింత కరుణమూర్తిగా భక్తకోటిని కటాక్షిస్తారని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.

బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ ఉత్సవాలను కాలక్రమేనా ఎందరో రాజులు, మహారాజులు, రాణులు తమ విజయపరంపరకు సూచికగా నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తొంది. బ్రహ్మోత్సవాలు జరిగే 9రోజులు కూడా ప్రతి ఉదయం, సాయంత్రం శ్రీవారి ప్రతిరూపమైన మలయప్పస్వామివారు ఊరేగే వాహనాలు సృష్టిలోని ఉత్తమోత్తమమైన స్వరూపాలని అర్చకులు చెబుతున్నారు. వాహన సేవలకు అగ్రపధాన నిరాకార రూపంలో బ్రహ్మ అధిష్టించిన బ్రహ్మరథం సాగగా గజ, తురగ, అశ్వ బలాలు వెనుక నడువగా, అబ్బురపరిచే కళకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ స్వామివారు వివిధ వాహనాలపై నాలుగు మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.

సెప్టెంబర్ 13నుంచి 21వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు 12వ తేదీ సాయంత్రం జరిగే అంకురార్పణతో బీజం పడుతుంది. అనంతరం 13వ తేదీ సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో తొలి ఘట్టంగా శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణం జరుగుతుంది. అనంతరం ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఇక ఆరోజు రాత్రి నుంచి వరుసగా వివిధ వాహనాలపై శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తారు. ముందుగా పెద్దశేష, అనంతరం చిన్నశేష, హంస, సింహా, ముత్యపుపందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, మోహిని అవతారం, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, చెక్కరథం, స్వర్ణరథాలతోపాటు చివరిగా అశ్వవాహనంపై సర్వాలంకారభూషితుడై స్వామివారు తిరువీధుల్లో విహరిస్తారు. ఇక 9వరోజు ఉదయం వారహస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మరియు సుదర్శన చక్కత్తాళ్వార్ వారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సుముహుర్తంలో స్వామివారి సుదర్శన చక్రాని పుష్కరిణిలో మూడుసార్లు ముంచడంతో ఉత్సవాల్లో చవరి ఘట్టమైన చక్రస్నాన మహోత్సవం ముగుస్తుంది. ఇక ఆ రాత్రికి శ్రీవారి ఆలయంలో జరిగే ధ్వజఅవరోహణంతో వెంకన్న వార్షిక బ్రహోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories