బ్లూవేల్ ఛాలెంజ్ దారుణాలు

బ్లూవేల్ ఛాలెంజ్ దారుణాలు
x
Highlights

కిల్లర్ గేమ్ బ్లూవేల్ ఛాలెంజ్ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు , శాస్త్రవేత్తలు చివరికి కోర్టులు కూడా ఈ కిల్లర్ గేమ్‌ను ఆడొద్దని , బాధిత...

కిల్లర్ గేమ్ బ్లూవేల్ ఛాలెంజ్ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు , శాస్త్రవేత్తలు చివరికి కోర్టులు కూడా ఈ కిల్లర్ గేమ్‌ను ఆడొద్దని , బాధిత తల్లిదండ్రులు దీన్ని నిషేధించాలని నెత్తీ నోరు కొట్టుకుని చెప్తున్నా ఆట ఆగడం లేదు. తాజాగా మరో అమ్మాయి ప్రాణాలను తీసుకోబోతే స్థానికులు, పోలీసులు రక్షించడంతో బతికి బయటపడింది. తాజాగా రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌కు చెందిన ఓ 17 ఏళ్ల అమ్మాయి దీని బారినపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న ఆ బాలిక తన చేతిపై బ్లూవేల్ ఆకృతిని కత్తితో గీసుకొని.. చెరువులోకి దూకేసింది. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఆ అమ్మాయి చెరువులో దూకినప్పటికీ.. అదృష్టవశాత్తు అక్కడ ఉన్న స్థానికులు కొంత మంది గమనించడంతో ప్రమాదం తప్పింది. గజ ఈతగాళ్లు చెరువు నుంచి ఆమెను కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. బాధిత అమ్మాయి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాను కూతురు. సోమవారం (సెప్టెంబర్ 5) సాయంత్రం మార్కెట్‌కు వెళుతున్నానని చెప్పి ఆమె స్కూటీపై బయలుదేరింది. చీకటిపడుతున్నా తిరిగి ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలిక సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా.. మరో వ్యక్తి ఫోన్ ఎత్తాడు.

రోడ్డుపై దొరికిందని అతడు బదులిచ్చాడు. దీంతో అమ్మాయి గురించి ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసుల సాయంతో ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు. ఓ సరస్సుకు కొద్ది దూరంలో బాలిక స్కూటీపై కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకునే సరికి బాలిక కొండపైకి ఎక్కుతూ కనిపించింది. పోలీసులు వారిస్తున్నా వినకుండా అక్కడి నుంచి నేరుగా సరస్సులోకి దూకేసింది. వెంటనే పోలీసులు డైవర్ల సాయంతో ఆమెను రక్షించారు. అనంతరం ఆ బాలికను ప్రశ్నించగా.. నేను టాస్కును పూర్తి చేస్తున్నా.. దీన్ని పూర్తి చేయకపోతే అమ్మ చనిపోతుంది అని చెప్పిందట. ఆటలో పూర్తిగా మునిగిపోయి తమకు తామే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ ప్రమాదకర ఆన్‌లైన్ గేమ్ బారిన చాలా మంది యువతీయువకులు పడుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల ప్రవర్తనను ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.

‘బ్లూ వేల్’ లేదా ‘బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది సోషల్ మీడియా ఆధారిత ఒక ఆట. ఇది ఆటగాళ్ళను ఆత్మహత్య చేసుకునేటట్లుగా ప్రేరేపించి వారి జీవితాన్ని బలితీసుకుంటుంది. మనదేశంలో దీనిని నిషేధించినా అనేక మంది అనధికారికంగా ఈ ఆట ఆడుతూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బ్లూవేల్ ఆటను డౌన్లోడ్ చేసుకుని ఆడే ఆటకాదు. సాఫ్ట్‌వేర్ కూడా కానేకాదు. ఇంటర్నెట్‌కు ఆకర్షితులై ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లలకు ప్రత్యేక స్నేహితులుగా పరిచయం చేసుకుని రహస్యంగా ఆన్‌లైన్ ఛాలెంజ్లు నిర్వహిస్తుంటారు. పిల్లలు, యువతను గుర్తించి వారిని ప్రత్యేక లింకుల ద్వారా గ్రూపులోకి తీసుకుంటారు. వారు తమంతట తామే తనువు చాలించేలా గేమ్ పేరిట ప్రోత్సహిస్తుంటారు. 50 వరకు పోటీలు నిర్వహించి ఆత్మహత్యతో ముగిసేలా ఛాలెంజ్‌కు సిద్ధం చేస్తుంటారు. ఇలా ఈ ఆట ఆడే బాధితులంతా 12-19 ఏళ్లలోపు పిల్లలే. ఈ క్రీడకు ఆకర్షితులు కావడానికి మానసిక ఆందోళనే ప్రధాన కారణం. ఒత్తిడి, చదువు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మందలింపు కారణాలతో కొందరు జీవితంపై విరక్తిని పెంచుకుంటుంటారు. ఇలాంటివారు ఎవరితోనూ కలివిడిగా మాట్లాడరు. ఎప్పుడూ ఒంటరిగా గడుపుతుంటారు. ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు ఇంటర్నెట్లో ఛాటింగులు చేస్తుంటారు. ఈ క్రీడలో పిల్లలకు ఇచ్చే లక్ష్యాలు (టాస్కులు) హింసతో కూడుకున్నవి. బ్లేడుతో చేతిపై చిత్రాలను గీసుకుంటారు. ఆంగ్ల అక్షరాలు రాసుకుంటారు.

ఉదయాన్నే 4.20కి లేచి ఆన్‌లైన్ గ్రూపు నిర్వాహకుడు పంపించే వీడియోలు చూస్తుంటారు. తిమింగలం చిత్రాన్ని కాగితాలపై వేస్తుంటారు. వాటిని ఫోన్‌ద్వారా ఫొటోలు తీస్తుంటారు. తానూ ఒక వేల్‌గా మారాననుకుని కాలిపై ఎస్ లాంటి అక్షరాలు రాసుకుంటారు. తప్పుకోవాలని చూస్తే నిర్వాహకులు బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. వారికి తిరిగి తలొగ్గితే శిక్షగా చేతిపై వీలైనన్ని ఎక్కువసార్లు కోసుకోవాలి. వంతెనలపైకి వెళ్లడం, ఇంటి పైకప్పు చివరలో నిల్చోవడం, అక్కడే కాళ్లను ఆడించడం చేస్తారు. వివిధ రకాలైన పరీక్షల తరువాత క్రీడలో యాక్టివ్‌గా ఉన్నారో.. లేదో.. నిర్వాహకులు పరిశీలిస్తారు. చివరగా ఒకరోజు క్రీడలోని బాలుడికి చావు తేదీని గ్రూపు నిర్వాహకులే ఖరారు చేస్తారు. ఉదయమే లేచి రోడ్డు, రైలు మార్గాల్లో నడవాలని చెబుతారు. ఒకరోజంతా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలని ఆదేశిస్తారు. భయంగొలిపే వీడియోలు చూడాలని చెబుతారు. ప్రతిరోజు తన శరీరంలో ఏదో ఒక భాగంపై గాయాలు చేసుకోవాలని సూచిస్తారు. చివరగా భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలని ఆదేశిస్తారు. ఇలా ఈ ఆటకు పిల్లలు బలౌతున్నారు.

పిల్లలు స్కూలు నుండి, కాలేజి నుండి ఇంటికి రాగానే రూములో ఏం చదువుతున్నారు.. ఏం చేస్తున్నారు..సెల్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారు.. ఇలా తల్లిదండ్రులు పిల్లల్ని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ప్రస్తుత సమాజంలో అన్ని వైపుల నుండి పిల్లలపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. వాటి నుండి బిడ్డలను రక్షించుకోవాలంటే పిల్లలపై నిఘా ఉంచాల్సిందే. అడిగిన వెంటనే స్మార్ట్‌ఫోన్ కొనిచ్చేశాము, హాయిగా వాళ్లు ఆ ఫోన్‌తో ఎంజాయ్ చేస్తున్నారులే అని తల్లిదండ్రులు అనుకుంటే తమ పిల్లలకు తామే ముప్పు చేసినవారు అవుతారు. ఇంటర్‌నెట్ చేస్తున్న మాయలు, దారుణాలకు పిల్లలు ఎందరో బలౌతున్నారు. ఇప్పుడు బ్లూవేల్ ఛాలెంజ్ పేరుతో మరో మహమ్మారి పిల్లలపై పడుతోంది. కొత్తగా టెక్నాలజీ అభివృద్ధి అవుతున్నందుకు సంతోషించాలో లేక రెండో వైపున ఇలాంటి తప్పుడు ఆటలతో ఎందరో పిల్లలు బలౌతున్నారని బాధపడాలో ఆలోచించుకోవాలి. దీనిపై అందరూ ఆలోచించాల్సిందే..!!

Show Full Article
Print Article
Next Story
More Stories