బీజేపీకి అధికార పిచ్చి అంటూ కీలక నేత రాజీనామా

Submitted by lakshman on Thu, 03/22/2018 - 09:55
BJP IT cell founder Prodyut Bora quits; attacks PM Modi, Amit Shah

మనసు చంపుకుని ఇక పార్టీలో పని చేయలేనంటూ ఓ కీలక నేత పదవి వదిలేశారు. అసలే ఏపీ ఎంపీలు చేస్తున్న రచ్చతో జనంలో దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్న బీజేపీ ఇప్పుడు ఈ పరిణామంతో దిమ్మెరపోయింది. బీజేపీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు ప్రద్యుత్ బోరా బుధవారం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీకి, ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
దేశం నలుమూలలకు బీజేపీని విస్తరించేందుకు ఐటీ సెల్ ద్వారా ప్రద్యుత్ బోరా కీలక పాత్ర పోషించారు. మొన్నటి ఎన్నికల్లో మోడీ విజయానికి… పార్టీ సోషల్ మీడియా తరపున తీవ్రంగా కృషి చేసారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ‘‘ప్రజాస్వామ్య సంప్రదాయానికి తూట్లు పొడవడంపై’’ కలత చెందాననీ.. మిగతా పార్టీలకు బీజేపీకి తేడా లేకుండా పోయిందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘‘పార్టీకి బాగా పిచ్చి ముదిరింది. ఎలాగైనా గెలిచితీరాలన్న ఉద్దేశ్యంతో పార్టీ విలువలను తుంగలో తొక్కేశారు. 2004లో నేను చేరిన పార్టీ ఇది కాదు..’’ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
పార్టీ సాగిస్తున్న ప్రస్తుత విధానాలతో బీజేపీపై తనకు నమ్మకం పోయిందన్నారు. ‘‘ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా దేశానికి ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం. ఇందుకు బీజేపీ కూడా మినహాయింపు కాదు. ప్రజలు ఇతర అవకాశాల వైపు చూస్తున్నారు..’’ అని బోరా పేర్కొన్నారు. అస్సాంలో కాంగ్రెస్, ఆమాద్మీ, ఏజీపీ పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు వచ్చినప్పటికీ వాటిని ఎప్పుడూ స్వీకరించలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా పనితీరుపై ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ బోరా తన నాలుగు పేజీల లేఖలో లేవనెత్తారు.
ఒకవైపు ఏపీకి జరిగిన అన్యాయంపై ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలు చేస్తున్న నిరసనలు కూడా పట్టించుకోకుండా పార్లమెంటులో ఎంపీలు ఇస్తున్న అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండా చేయడంలో సఫలం అవుతున్న బీజేపీకి ఈ పరిణామం నిజంగా షాక్ అనే చెప్పాలి. నిత్యం ఐటీ మంత్రం జపించే మోడీకి. ఆ పార్టీ ఐటీ విభాగ అధిపతి రాజీనామ చేయడం పైగా పార్టీ అధికార దాహాన్ని ప్రశ్నించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య యుతంగా పరిపాలించడం లేదనదానికి ఇంతకంటే నిదర్సనం ఏం కావాలి మరి.

English Title
BJP IT cell founder Prodyut Bora quits; attacks PM Modi, Amit Shah

MORE FROM AUTHOR

RELATED ARTICLES