ఈసారి మళ్లీ ఆయనకు టికెట్‌ ఇస్తే టీఆర్‌ఎస్‌ ఓడిపోయే మొదటి సీటు ఇదే: టీఆర్‌ఎస్‌ నేతలు

Submitted by arun on Fri, 08/31/2018 - 15:52
kcr

ముందస్తుతో తెలంగాణలో మళ్లీ జెండా పాతాలని కేసీఆర్‌ వడివడిగా అడుగులేస్తుంటే మరోవైపు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో తిరుగుబాటు వ్యక్తమవడం అధిష్టానాన్ని కలవరపెడుతోంది. అనేక నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు ఊపందుకోగా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌కు వ్యతిరేకంగా అసమ్మతి సెగ పతాక స్థాయికి చేరుకుంది. చెన్నమనేనికి వ్యతిరేకంగా వెయ్యి మందికి పైగా టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు ఏకమయ్యారు. ఈసారి చెన్నమనేనికి టికెట్‌ ఇస్తే టీఆర్‌ఎస్‌ ఓడిపోయే మొదటి సీటు ఇదే అవుతుందని హెచ్చరిస్తున్నారు.

ముందస్తు హడావిడితో అధికార టీఆర్‌ఎస్‌లో టికెట్ల లొల్లి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. అనేక నియోజకవర్గాల్లో ఈసారి మళ్లీ ఆయనకు టికెట్‌ ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. పలుచోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తుండటం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబుపై స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు వెయ్యిమంది ప్రజాప్రతినిధులు, నాయకులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు చెన్నమనేనికి వ్యతిరేకంగా మీటింగ్‌ పెట్టారు. ఈసారి మళ్లీ చెన్నమనేనికి టికెట్‌ ఇస్తే టీఆర్‌ఎస్‌ ఓడిపోయే మొదటి సీటు వేములవాడే అవుతుందని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు.

వేములవాడ ఎమ్మెల్యే జర్మనీలో ఉంటూ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని, పైగా కార్యకర్తలను వేధిస్తూ జైల్లో పెట్టిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీపీ రంగు వెంకటేశం ఆరోపిస్తున్నారు. చెన్నమనేనికి మళ్లీ టికెట్‌ ఇవ్వొద్దని, ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో నెలకొన్న వ్యతిరేకతను టీఆర్‌ఎస్‌ నేతలు బహిరంగంగా వ్యక్తపరుస్తుండటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మున్ముందు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందేమోనన్న ఆందోళన నెలకొంది.

Tags
English Title
bickering in trs over tickets

MORE FROM AUTHOR

RELATED ARTICLES