చిక్కుల్లో పడ్డ కలెక్టర్‌.. వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ తిట్ల దండకం

Submitted by arun on Thu, 12/21/2017 - 13:35
Bhupalpally collector A Murali

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మురళి తాను వివాదాస్పద కలెక్టర్‌నని మరోసారి నిరూపించుకున్నారు. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్‌ చేస్తూ అన్ని వర్గాల నోళ్లల్లో నానుతున్న కలెక్టర్‌ మురళీ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. జిల్లా ఎంపీడీవోల సమావేశంలో అధికారులకు నోరుజారి చిక్కుల్లో పడ్డారు. ఎక్కువ జీతం తీసుకుంటూ టైమ్‌పాస్‌ చేస్తున్న అధికారులు దున్నపోతులు, వెధవలంటూ వ్యాఖ్యలు చేయడంతో ఎంపీడీవోలు సామూహిక నిరసనలకు దిగారు.

రెండురోజుల కింద ఎంపీడీవోలతో కలెక్టర్‌ మురళీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. పారదర్శక పాలన విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సలహాలిస్తూనే టంగ్‌ స్లిప్‌ అయ్యారు. జిల్లాలో ఉన్న మండల పరిషత్‌ అధికారులంతా వెధవలు, దున్నపోతులంటూ నోరు జారారు. ఎక్కువ జీతాలు తీసుకుంటూ సర్కారీ సొమ్ము బొక్కుతూ పని చేత కావట్లేదా అంటూ అంతెత్తున లేచారు. పనిచేయడం చేతకాని వాళ్లని సస్పెండ్‌ చేసి పారేస్తానని వార్నింగ్‌ ఇస్తూనే ఘన‌పురం ఎంపీడీవో శ్రీధర్‌స్వామిపై వేటు వేశారు. దీంతో జిల్లా ఎంపీడీవోలంతా ఏకమయ్యారు. కలెక్టర్‌ తీరును నిరసిస్తూ సామూహికంగా విధులను బహిష్కరించారు.

వాస్తవానికి భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మురళీకి ఇలాంటి వివాదాలేమీ కొత్త కాదు. గతంలో కూడా బ్రాహ్మణులను వెటకారమాడి వివాదాల్లోకి ఎక్కారు. ప్రపంచ క్షయవ్యాధి నిరోధక దినోత్సవం సందర్భంగా బ్రాహ్మణ సంస్కృతిపై మాట్లాడి వివాదాస్పదమయ్యారు. దళితులందరూ అడవి పంది మాంసం తినొచ్చని, అడవి పందులను చంపుకొని తింటే ఎలాంటి కేసులు ఉండవని వారి ప్రోత్సహించారు. కట్టుబాట్ల పేరుతో బ్రాహ్మణులు అడవి పంది, పంది మాంసం తినవద్దని పనికి రాని ఆంక్షలు పెట్టారని విమర్శించి వివాదాల్లోకి ఎక్కారు. 

అంతేకాదు ఒకవైపు జిల్లా ఎక్సైజ్‌ శాఖ గుడంబా నియంత్రణ కార్యక్రమం చేపడుతుంటే కలెక్టర్‌ తనకిష్టమైన వివాదాదస్పద దారిని ఎంచుకున్నారు. గుడంబా తాగొద్దంటూ సాక్షాత్తూ ముఖ‌్యమంత్రి కేసీఆర్‌పై ఒట్టు వేయించి దుమారం లేపపారు. అంతేనా ఈ కలెక్టర్‌ వివాదాస్పద లీలలు చాలానే ఉన్నాయి. మొన్నటికి మొన్న మేడారం జాతర జరిగే పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నరబలి చేయకూడదని ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతినేలా వ్యవహించారన్న ఆపవాదును మూటగట్టుకున్నారు.

 ఏమైనా జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ మురళీ వ్యవహార శైలిపై జిల్లా ప్రజలు తలోమాట మాట్లాడుకుంటున్నారు. సాక్షాత్తూ ఉన్నతాధికారులనే టార్గెట్‌ చేస్తూ వారిని వెధవలంటూ దున్నపోతులతో పోలుస్తూ ఏకిపారేస్తుంటే తమ కష్టాలు చెప్పుకొవడానికి వెళ్తే తమ పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. 

English Title
bhupalpally collector controversy comments

MORE FROM AUTHOR

RELATED ARTICLES