ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ సమ్మె సైరన్

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ సమ్మె సైరన్
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో సమ్మె సైరన్ మోగింది. యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. ముందుగా...

ఆంధ్రప్రదేశ్‌లో సమ్మె సైరన్ మోగింది. యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. ముందుగా ప్రకటించిననట్లుగా జూన్ 13నుంచే సమ్మెకు వెళ్తామని తేల్చిచెప్పారు. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి ఎటువంటి హామీ లభించలేదని దాంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక జేఏసీ ప్రకటించింది. మొత్తం 53వేల 500మంది ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో పాల్గొంటారని తేల్చిచెప్పింది.

కార్మికుల వేతన సవరణ, బకాయిల చెల్లింపు, అద్దె బస్సుల పెంపు, సిబ్బంది కుదింపు చర్యల నిలుపుదల సహా మొత్తం 26 డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యం ముందు కార్మిక సంఘాలు పెట్టాయి. అయితే మూడు గంటలకు పైగా చర్చలు జరిగినా, యాజమాన్యం మాత్రం తమ హామీలను అంగీకరించలేదని కార్మిక సంఘాలు తెలిపాయి. దాంతో సమ్మె తేదీని వాయిదా వేసుకోవాలని యాజమాన్యం కోరిందని, అయితే ముందే సమ్మె తేదీని ప్రకటించినందున వెనక్కి తగ్గేది లేదని జేఏసీ ప్రకటించింది.

తాము చేపట్టనున్న సమ్మె యాజమాన్య వైఖరికి నిరసనగానే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని జేఏసీ నాయకులు స్పష్టంచేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్‌ హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అలాగే ఆర్టీసీని ఆర్ధికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 3వేల 700 కోట్లిచ్చి ఆర్టీసీని ఆదుకోవాలని, ఏటా నష్టాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా పరిశీలించాలని కార్మిక సంఘాలు కోరాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే 13నుంచి సమ్మె తప్పదని తేల్చిచెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories