అందరికి ఆదర్శం ఈ యువరైతు...ఆరు ఎకరాల్లో 8 రకాల పసుపు సాగు

Chinna Reddy
x
Chinna Reddy
Highlights

ఆయనో యువరైతు అందరిలా ఆలోచించకుండా వినూత్నంగా పసుపు సాగు చేపట్టాడు కొత్త విధానంతో పాటు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న కొత్త వెరైటీలను పరిచయం చేశాడు.

ఆయనో యువరైతు అందరిలా ఆలోచించకుండా వినూత్నంగా పసుపు సాగు చేపట్టాడు కొత్త విధానంతో పాటు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న కొత్త వెరైటీలను పరిచయం చేశాడు. తాను పండించిన ఆ పంటను ఇతర రైతులకు విత్తనంగా సరఫరా చేస్తూ కాసుల పంట పండిస్తున్నాడు. తనకున్న ఆరు ఎకరాల భూమిలో 8 రకాల పసుపు సాగు చేస్తూ బేష్ అనిపించుకుంటున్నాడు ఆ యువరైతు. ఆ యువరైతు సాగు విధానాం చూసి మరికొంత మంది ఆయన బాటలో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ నష్టాల నుంచి లాభాల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. పసుపు సాగులో ప్రత్యేకత చాటుకుంటున్న నిజామాబాద్ జిల్లా యువరైతు పై నేలతల్లి ప్రత్యేక కథనం.

ఈ యువరైతు పేరు చిన్నారెడ్డి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి గత 15 ఏళ్లుగా పసుపు పండిస్తున్నాడు. తల్లిదండ్రుల నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ రైతు పసుపు సాగులో వినూత్న పద్దతిని అవలంభిస్తు నూతన వెరైటీలను జిల్లా రైతులకు పరిచయం చేశాడు. తనకు ఉన్న ఆరు ఎకరాల్లో సుమారు 8 వెరైటీల పసుపును సాగు చేస్తున్నాడు. విదేశాల్లో డిమాండ్ ఉండే రకాలను ఇతర ప్రాంతాల నుంచి విత్తనాలు తీసుకొచ్చి మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ రైతే ఇతర ప్రాంతాల రైతులకు కొత్త వెరైటీ పసుపును విత్తనాలుగా అందించే స్ధాయికి ఎదిగాడు.

మగ్గిడి గ్రామంలో చిన్నారెడ్డి సాగును చూసి ఇతర రైతులు సైతం కొత్త పద్ధతిలో సాగు చేస్తూ నూతన వెరైటీలను పండిస్తున్నారు. సాంప్రదాయ పసుపు కాకుండా కొత్త వెరైటీ రకాలను సాగు చేయడం ద్వారా ఎక్కువ దిగుబడి సాధించానని రైతు చిన్నారెడ్డి చెబుతున్నారు. తాను పండించిన కొత్త వెరైటీ పసుపును విత్తనాల కోసం చాలా మంది రైతులు అడుగుతున్నారని చిన్నారెడ్డి చెబుతున్నారు.

రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా రైతులు పసుపును ఎక్కువగా సాగు చేస్తుండగా సాంప్రదాయ పద్ధతిలో మెజార్టీ రైతులు పంటను పండిస్తున్నారు. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్ పల్లి, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్ పల్లి, మాక్లూర్, నందిపేట, తదితర ప్రాంతాల్లో పసుపు ఎక్కువగా సాగు చేస్తున్నారు. అందరిలా కాకుండా వినూత్నంగా, నూతన వెరైటీలను బెడ్ పద్ధతిని ఎంచుకుని సాగుకు శ్రీకారం చుట్టాడు. పసుపులో కుర్కమీన్ అధిక శాతం ఉండే రకాలను ఎంచుకుని సాగు చేస్తున్నాడు. కుర్కమీన్ అధికంగా ఉన్న పసుపుకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ రకాలను ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలుగా తీసుకొచ్చి సాగు చేస్తున్నాడు.

రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి, ప్రగతి ఏసీపీ, ఏసీపీ 79, రోమ, రాజపురి, బీఎస్ఆర్ -2 ఎర్ర గుంటూరు, లోకల్ రకం వంటి విత్తనాలను సాగు చేస్తున్నాడు. రాజేంద్ర సోనియా, రాజపురి వెరైటీ పసుపుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని రైతు చిన్నారెడ్డి చెబుతున్నాడు. వరంగల్ , కర్నూల్ , ఆదిలాబాద్, తదితర ప్రాంతాల నుంచి రైతులు వచ్చి విత్తనాలను తీసుకెళ్తున్నారు.

బెడ్ పద్దతిలో సాగు చేయడం ద్వారా పంటకు వెళుతురు సరిగ్గా అందుతుంది రైతులు చెబుతారు. చిన్నారెడ్డి తోట ఇప్పుడు ఓ పరిశోధన కేంద్రంగా మారడంతో చాలా మంది రైతులు ఆయన పండించిన వెరైటీలను చూసి తాము అదే తరహాలో పసుపు సాగు చేస్తున్నట్లు చెబుతున్నారు. కొత్త విధానం నూతన వెరైటీల సాగుతో దిగుబడులు పెరిగాయని అంటున్నారు రైతులు.

పసుపు సాగులో కూలీల భారం తగ్గించుకునేందుకు చిన్నారెడ్డి టర్మరిక్ ప్లాంటర్ మిషన్ కొనుగోలు చేశాడు. ఈ యంత్రం ద్వార మూడు ఎకరాల పసుపు పంటను ముగ్గురు కూలీల ద్వార నాటవచ్చని రైతు చెబుతున్నాడు. ఖర్చు తగ్గించుకుని దిగుబడులు పెంచేలా కొత్త పద్దతిలో సాగు చేస్తూ పసుపులో కాసుల పంట పండిస్తున్న ఈ యువరైతు పసుపు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

పసుపులో కుర్కమీన్ శాతం అధికంగా ఉండే పంటను పండించేందుకు సిద్దంగా ఉన్నా ఆ పంటను కొనుగోలు చేసే వ్యాపారులను జిల్లా మార్కెట్ కు తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. సాంగ్లీ మార్కెట్ లో తప్పా ఈ రకం పంటకు జిల్లాలో కోనుగోలు చేసే వాళ్లు లేరని ఆ దిశలో సర్కారు ప్రయత్నం చేస్తే చాలా మంది రైతులు విదేశాల్లో డిమాండ్ ఉండే రకాలను పండించేదుకు ఉత్సాహాం చూపుతారని రైతులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories