అభివృద్ధికి ‘బాట’సారి.. అటల్‌ జీ!

అభివృద్ధికి ‘బాట’సారి.. అటల్‌ జీ!
x
Highlights

ఆయనో బాట..సారి. మారుమూల గ్రామాలకు సైతం రహదారి సదుపాయం కల్పించారు. బావి తరాల కోసం సుమారు 20ఏళ్ల క్రితమే తన కలల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ముందు...

ఆయనో బాట..సారి. మారుమూల గ్రామాలకు సైతం రహదారి సదుపాయం కల్పించారు. బావి తరాల కోసం సుమారు 20ఏళ్ల క్రితమే తన కలల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ముందు చూపుతో అప్పట్లోనే జాతీయ రహదారులకు జీవం పోసిన మహానేత వాజ్ పేయి.
విశాలమైన జాతీయ రహదారులు ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం రెండు దశాబ్దాల క్రితం ఇవన్నీ సగటు భారతీయుడి కల మాత్రమే. ఇరుకు సందులు, గతుకుల రోడ్లే దిక్కని భావించేవారు. అలా అనుకునేవారు, తమ అభిప్రాయం మార్చుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు అప్పటి ప్రధాని. ఆయనే, భరతమాత ముద్దుబిడ్డ అటల్‌ బిహారీ వాజ్‌పేయీ. నేడు ఎటుచూసినా నాలుగు రోడ్ల విశాల జాతీయ రహదారులు, మారుమూల గ్రామాలకు సైతం రహదారి సదుపాయం ఉన్నాయంటే అది వాజ్ పేయి కృషి ఫలితమే.

దేశంలోని పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక నగరాలను అనుసంధానిస్తూ జాతీయ రహదారులను 4 లేదా 6 లేన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టే, గోల్డెన్‌ క్వాడ్రిలేట్రల్‌. 5వేల 846 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి నేషనల్ హైవే డెవలెప్ మెంట్ ప్రాజెక్టు పేరుతో నాటి ప్రధాని వాజ్‌పేయీ శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా రహదారులు లేని మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన మరో పథకమే ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన. 2000లో ఈ పథకానికి వాజ్‌పేయీ శ్రీకారం చుట్టారు. కొండ ప్రాంతం అధికంగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామాల గతిని ఈ పథకం పూర్తిగా మార్చివేసింది.

ఈ రెండు కలల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి పెట్రోల్‌, డీజిల్‌పై వాజ్‌పేయీ ప్రభుత్వం సెస్సు విధించింది. దీనిపై విపక్షాలు భగ్గుమున్నాయి. ప్రజలపై భారం మోపుతున్నారని నిందించాయి. అయినా, ఏమాత్రం లెక్కచేయకుండా విపక్షాల విమర్శలను పక్కనపెట్టి.. ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా వాజ్‌పేయీ ముందుకెళ్లారు. చివరికి ఇప్పుడున్న రహదారులు కూడా ఆయన చలవేనని స్వయానా సుప్రీం కోర్టు ముందు యూపీఏ సర్కారు అంగీకరించాల్సి వచ్చింది. గత 32 ఏళ్లలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వరకు వాజ్‌పేయీ హాయంలో రూపుదిద్దుకున్నాయే. అందుకే వాజ్‌పేయీ దేశాభివృద్ధికి మార్గం చూపిన బాటసారి.

Show Full Article
Print Article
Next Story
More Stories