రాజకీయ భీష్ముడు అటల్ బిహారీ వాజ్‌పేయి...నేను మృత్యువుకి భయపడను....

రాజకీయ భీష్ముడు అటల్ బిహారీ వాజ్‌పేయి...నేను మృత్యువుకి భయపడను....
x
Highlights

అటల్ బిహారీ వాజ్‌పేయి 1924, డిసెంబరు 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో జన్మించారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని రెండుసార్లు...

అటల్ బిహారీ వాజ్‌పేయి 1924, డిసెంబరు 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో జన్మించారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని రెండుసార్లు అధిష్టించిన అటల్‌... 93 ఏళ్ల బ్రహ్మచారి. ఆయన సుదీర్ఘకాలం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీ అధ్యక్షుడిగా, 1980 నుంచి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఆయన 13 రోజుల పాటు మాత్రమే ఆ పదవిలో వున్నారు. 1998లో రెండోసారి ప్రధానమంత్రి పదవి పొంది 13 నెలలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. వాజ్‌పేయికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. 1992లో పద్మ విభూషణ్, 1993లో కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్, 1994లో లోకమాన్య తిలక్ పురస్కారం, 1994లో గోవింద్ వల్లభ్ పంత్ అవార్డులు వరించాయి. మోడీ ప్రధాని అయ్యాక తన ప్రియ గురువు వాజ్‌పేయిని భారతరత్న సత్కరించి సన్మానించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మలచిన దేశభక్తుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి. పార్టీలు, ప్రాంతాలకు అతీతుడైన అజాతశత్రువు. దేశభక్తి రూపుదాల్చిన వ్యక్తి. మాజీ ప్రధానమంత్రి. ఆదర్శ నాయకుడు. ప్రభుత్వాలకు, పార్టీలకు మధ్య ఉన్న తేడాను తెలిపిన అరుదైన ప్రజాస్వామ్యవాది. తన ప్రసంగాలతో, ప్రవర్తనతో ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన మహోన్నతుడు. ఎందరికో అభిమానపాత్రుడు.

అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితగాథ హిందీలో హార్‌ నహీ మానూంగా అనే పేరుతో దాదాపు 450 పేజీల పుస్తకం వెలువడింది. ఆ పుస్తక రచయిత ప్రసిద్ధ జర్నలిస్టు విజయ్‌ త్రివేది. దాన్ని తెలుగులోకి అనువాదం చేసింది యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌. అటల్‌జీని భారత ప్రభుత్వం 2015 మార్చి 27న భారతరత్నగా గౌరవించుకొన్న సంఘటనతో రచయిత ఈ పుస్తకాన్ని ప్రారంభించడం విశేషం.

నభీతో మరణాదస్మి కేవళం దూషితః యశః అంటే నేను మృత్యువుకి భయపడను. చెడ్డపేరుకు, లోకోపవాదానికి మాత్రం భయపడతాను అనే వారు వాజ్‌పేయి. తాను నమ్మిన రాముని కథ, రామమందిర వివాదాలు, వితండవాదాలు, సమస్యల పరిష్కారానికి వాజ్‌పేయి ప్రయత్నాలు దేశం మరిచిపోదు. అత్యధిక స్థానాలొచ్చినా, ప్రజలు కాంగ్రెస్‌ను ఛీ కొట్టినా, ఇతర పార్టీల మద్దతు కోసం ఎక్కే గడపా, దిగే గడపా అయినా.. అజాత శత్రువు అనుకున్నది సాధించారు. 13 పార్టీలతో పడిన పాట్లు, పదవుల పందేరం బయటపడిన ప్రముఖుల నిజస్వరూపాలు, అమెరికా గూఢచార సంస్థల ముక్కూ, కళ్ళూ మూసి సాగిన పరమాణు రహస్యాలు, వైజ్ఞానిక విజయాలు, సస్పెన్సు థ్రిల్లర్ల వంటి పోఖ్రాన్‌ వీరగాథ, కలామ్‌-అటల్‌ల ధైర్య సాహసాలు ఇవన్నీ దేశ ప్రజలకు సుపరిచితాలు

ఆర్థిక ఆంక్షలను అధిగమించిన వైనాలు, గొప్ప హృదయంతో పాక్‌కి అందించిన స్నేహహస్తం, లాహోర్‌ యాత్ర విశేషాలు, నవాబ్‌- ముషారఫ్‌ల కయ్యాలు, కజ్జాలు, కార్గిల్‌ వెన్నుపోటు విశేషాలు, పార్లమెంటుపై దాడులు, అంతకుముందు జరిగిన హైజాకులు.. పరిస్థితులు ఎంతటి విపత్కరమైనా ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, చూపించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యం. ఆ మహనీయుని నిరాడంబరతకి నిదర్శనం. సుదీర్ఘ రాజకీయ జీవితంలోని ఆటుపోట్లను, ఆసక్తికర విషయాలు నేటి తరానికి ఓ మంచి అనుభూతి... అంతకుమించి స్ఫూర్తి.

Show Full Article
Print Article
Next Story
More Stories