తాత నుంచి భారమైన ఆఖరి ‘బహుమతి’

Submitted by arun on Sat, 08/18/2018 - 09:38
Niharika Bhattacharya

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి రాజకీయాలకు స్వస్తి చెప్పిన తర్వాత జీవితాన్ని ఎలా గడిపారు ? పూర్తిగా ఇంటి వద్ద ఉంటూనే కుటుంబంతోనే గడిపారా ? వయసు మళ్లిన వాజ్‌పేయిని ఆయన కుటుంబసభ్యులు ఎలా చూసుకున్నారు. దత్తపుత్రిక నమితా భట్టాచార్య అన్ని తానై చూసుకున్నారా ?

2004లో ఎన్డీఏ కూటమి ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన అటల్‌ బిహారీ వాజ్‌పేయి అప్పట్నుంచి ఇంటికే పరిమితమయ్యారు. 2005 నుంచి ఇంటికే పరిమితమైన వాజ్‌పేయిని కంటిరెప్పలా చూసుకున్నారు దత్తపుత్రిక నమితా భట్టాచార్య. వృద్ధాప్యంలో ఉన్న వాజ్‌పేయికి సపర్యలు చేస్తూ నిరంతరం కాపాడుకున్నారు. రాత్రీపగలన్న తేడా లేకుండా వాజ్‌పేయిని చిన్న పిల్లాడిలా చూసుకున్నారు.

వాజ్‌పేయి ఎప్పుడు అనారోగ్యానికి గురయినా వెంటనే వైద్యులను పిలిపించి చికిత్స చేయించేవారు. తీవ్ర అనారోగ్యంతో జూన్‌ 12న ఎయిమ్స్‌లో చేర్పించిన తర్వాత కూడా దత్తపుత్రిక నమితా భట్టాచార్య, ఆమె కూతురు నిహారిక, ఇతర కుటుంబసభ్యులు వాజ్‌పేయి వెన్నంటే ఉన్నారు.

అటల్‌ బిహారీ వాజ్‌పేయి నుంచి ఎప్పుడూ బహుమతులు అందుకునేది నిహారిక. చివరి కానుకగా అటల్‌ పార్థీవదేహంపై ఉంచిన జాతీయ పతాకాన్ని అందుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా నిహారిక ఉద్వేగానికి లోనవుతూ త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లారు. ఇంతకాలం శిఖరంలా అండగా ఉన్న వాజ్‌పేయి మృతిని దత్తపుత్రిక నమితా భట్టాచార్య జీర్ణించుకోలేకపోతున్నారు. స్మృతిస్థల్‌లో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. వాజ్‌పేయి దత్తపుత్రికగా అటల్‌ భౌతికకాయానికి నిప్పంటిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు నమితా భట్టాచార్య. 

Image removed.

English Title
Atal Bihari Vajpayee cremation Niharika Bhattacharya who was handed over the tricolour

MORE FROM AUTHOR

RELATED ARTICLES