తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మహాకూటమి

x
Highlights

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మహాకూటమి తెరమీదికొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీని గద్దె దించాలంటే.. వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలన్న ఉమ్మడి...

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మహాకూటమి తెరమీదికొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీని గద్దె దించాలంటే.. వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలన్న ఉమ్మడి అవగాహన ఓ రూపం తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. విభిన్న పార్టీలుగా విడివిడిగా పోరాడేకన్నా.. ఐక్యకూటమిగా ఏర్పడితే కేంద్రంలోని ఎన్డీయేను, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం సులువు అవుతుందన్న అభిప్రాయాలు.. లెఫ్ట్ పార్టీల్లో, వివిధ ప్రజాసంఘాల్లోనే గాక టీ-జాక్ లో కూడా వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ మీద ఐక్యంగా కదలకపోతే ఎన్నికల రణక్షేత్రంలో ఫలితాలు రాబట్టలేమన్న స్పృహ.. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులలో బలం పుంజుకుంటోంది. తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం మినహా.. మిగతా అన్ని పార్టీలు కూడా అధికార పార్టీ విధానాల మీద అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. రైతు ఆత్మహత్యల వంటి సున్నితమైన అంశాలతో పాటు 24 గంటల కరెంటుతో లాభం కన్నా నష్టమే ఎక్కువని, అందువల్ల ఎండాకాలం రాకముందే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందంటూ కాంగ్రెస్, లెఫ్ట్, టీ-జాక్, టీమాస్ వంటి వివిధ సంఘాలు, సంస్థలు ప్రజాక్షేత్రంలో ప్రచారం చేస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతూ.. మరోవైపు అదే వ్యతిరేకతను ఎన్నికల్లో ఉపయోగించుకునే విధంగా టీ-జాక్, టీ-కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నేతలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే టీ-కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫ్యామిలీనే టార్గెట్ గా విమర్శలకు పదును పెంచడం విశేషం.

అటు టీ-జాక్ కూడా రైతు ఆత్మహత్యల మీద క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. రైతు సదస్సులు ఏర్పాటు చేస్తూ.. రైతువర్గాన్ని ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం తీవ్రస్థాయిలోనే జరుగుతోంది. తెలంగాణ వచ్చాక 3 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని కోదండరామ్ ఆరోపిస్తున్నారు.

ప్రజాక్షేత్రంలో ఎవరిస్థాయిలో వారు పనిచేస్తున్నా.. ఎన్నికల సమయంలో ఒక్కటిగానే ఉండాలన్న ప్రాథమిక అవగాహన ఈపాటికే కుదిరిందని సమాచారం. టీ-జాక్ చైర్మన్ కోదండరామ్ పార్టీ పెట్టే అంశం మీద ఇప్పటికైతే బహిరంగ ప్రకటన చేయకపోయినా.. ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు.. ఈపాటికే ఆయన సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డితో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ఆశిస్తున్న టీ-కాంగ్రెస్... ప్రభుత్వ వ్యతిరేకత తమకు పనికొచ్చేలా పావులు కదుపుతోంది. వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తపడుతూనే.. ఆ ప్రతిపాదనేదో ఇతర పార్టీల నుండే రావాలని భావిస్తోంది. అందువల్ల పొత్తులో తలెత్తే సీట్ల కేటాయింపు చిక్కులు రాకుండా జాగ్రత్తపడుతోంది. అటు సీపీఎం కూడా కాంగ్రెస్ తో జట్టు కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.

మొత్తానికి తెలంగాణలో లెఫ్ట్ పార్టీల బలం.. కనుమరుగవుతున్న దశలో ఉన్న టీడీపీ ఓట్లు.. కాంగ్రెస్ కు క్రమంగా పెరుగుతున్న ఆదరణను ఓట్లుగా మలచుకునే ఎత్తుగడలు.. బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీని అదే స్థాయిలో ఎదుర్కొనే వ్యూహాలు... తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 2009లో ఏర్పడ్డ మహాకూటమి లాగే.. ఇప్పుడు కూడా రెండు అధికార పార్టీలకు వ్యతిరేకంగా మహాకూటమిగా ఏర్పడాలని కాంక్ష బలపడుతోంది. మరి మహాకూటమి స్వరూప, స్వభావాలు ఎలా ఉంటాయి? ఏమేరకు ప్రజాశ్రేణుల్ని ప్రభావితం చేస్తుందనేది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories