గల్ఫ్‌లో మండుతున్న ఎండలు

గల్ఫ్‌లో మండుతున్న ఎండలు
x
Highlights

గల్ఫ్‌లో ఎండలు మండుతున్నాయి. పలు ప్రాంతాలు నిప్పుల కుంపటిగా మారాయి. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. రహదారులు నిర్మానుష్యంగా...

గల్ఫ్‌లో ఎండలు మండుతున్నాయి. పలు ప్రాంతాలు నిప్పుల కుంపటిగా మారాయి. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేడిగాలుల ప్రభావం, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నడూ లేనంతగా సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో పార్క్ చేసి ఉంచిన కార్లు తగలబడుతున్నాయి.

సౌదీ అరేబియా, కువైట్‌ ప్రాంతాల్లో ఎండలు దండికొడుతున్నాయి. ఎండవేడితో పాటు వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. చెట్లు, కార్లు తగలబడుతున్నాయి. పార్క్ చేసి ఉంచిన కార్లు తగలబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వేసవిలో మండుటెండల నుంచి కార్మికులకు ఉపశమనం కలిగేలా గల్ఫ్‌ దేశాల్లో తీసుకొచ్చిన చట్టాలు పకడ్బం దీగా అమలు కావడం లేదు. గల్ఫ్‌ దేశాల్లో సాధారణంగా ఏడాది మొత్తం ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఈ దేశాల్లో ఎండాకాలం, శీతాకాలం మాత్రమే ఉంటాయి. వర్షాకాలం ఉండదు. నవంబర్‌ నుంచి మార్చి వరకు శీతాకాలం, ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఎండాకాలం ఉంటుంది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఎండలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు 37 నుంచి 49 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటాయి. సముద్ర తీరాలు, గ్యాస్‌ ఉత్పాదక కంపెనీలు ఉన్నచోట ఉష్ణోగ్రత దాదాపు 54 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది.

ఉక్కపోత వాతావరణ పరిస్థితుల్లో ఆరుబయట పనిచేయడం చాలా కష్టతరం. వేసవిలో కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూన్, జులై, ఆగస్టు నెలల్లో పనివేళలు మారుస్తారు. ప్రతి రోజు 8 గంటల పనిచేయాల్సి ఉంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనివేళలు మారుస్తారు. వేసవిలో మధ్యాహ్నం 12.30 గం టల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆరుబయట కార్మికులతో పనిచేయించడం చట్ట విరుద్ధం. చట్టాలకు విరుద్ధంగా పనిచేయించే కంపెనీలకు భారీగా జరిమానా విధిస్తారు.

గల్ఫ్‌ దేశాల్లో వేసవిలో మూడు నెలలు మధ్యాహ్నం పనివేళలు బంద్‌ చేయడం సాధారణంగా జరుగుతుంది. కానీ, అన్ని కంపెనీలూ కచ్చితంగా ఈ నిబంధనలు పాటించడం లేదు. కొన్ని కంపెనీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఈ విషయంలో నిఘా మరింత పెంచితే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories