మంత్రి గంటా రూట్ మారుతుందా...వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తారా ?

Submitted by arun on Sat, 04/14/2018 - 17:23
ganta

ఏపీ పాలిటిక్స్‌లో గంటా శ్రీనివాసరావు రూటే సెపరేటు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంత్రిగా ఉండటం ఆయనకే చెల్లింది. ఇప్పటికే విశాఖలో 4 నియోజకవర్గాలు మారిన గంటా ఇప్పుడు పక్క జిల్లాపై ఫోకస్ పెంచారట. ఇక్కడి నుంచి ఫోకస్ అక్కడికి ఎందుకు మార్చినట్టు.?

గంటా శ్రీనివాసరావు ప్రకాశం జిల్లాలో పుట్టి విశాఖ జిల్లా కేంద్రంగా ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న నేత.
 ఎన్నికలు ఎప్పుడొచ్చినా నియోజకవర్గం మారిపోతారు. మారటమే కాదు గెలుస్తారు. గెలవడమే కాదు తనకంటూ తయారుచేసుకున్న బ్యాచ్‌ను గెలిపించుకుంటారు. ఆయన గెలిచిన ప్రతిసారి మంత్రి పదవి ఖాయం. ఇదే ఆయన పొలిటికల్ స్టైల్. అలాంటి గంటా సడన్‌గా విశాఖ నుంచి విజయనగరానికి ఎందుకు రూటు మార్చినట్టు.?

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిసారి నియోజకవర్గాన్ని మార్చేస్తారు మంత్రి గంటా శ్రీనివాసరావు. అలా ఈసారి తన అడ్డాను విశాఖ జిల్లా నుంచి విజయనగరానికి తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకే జిల్లాలో 4 నియోజకవర్గాలు మారిన గంటా వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారట. కడప జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఆయన విజయనగరం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా రావడానికి కారణం కూడా అదేనని టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

విశాఖ జిల్లాలో మంత్రి అయ్యన్నపాత్రుడితో పడకపోవడం, చిన్న దానికి, పెద్ద దానికి తనపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం గంటాకు నచ్చడం లేదట. అంతేకాదు తన సన్నిహితుడిగా చెప్పుకునే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ సైతం గంటాకు దూరంగా ఉండటంతో చేసేదేమీ లేక విశాఖను వదిలేయాలని భావిస్తున్నారట. అందుకే రాబోయే ఎన్నికల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత నెల్లిమర్ల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామికి వయోభారంతో ఈసారి టికెట్ దక్కే చాన్స్ లేదని తెలుస్తోంది. ఆయన వారసులపైనా నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కచ్చితంగా వారికి టికెట్ దక్కే చాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. అందుకే గంటా రెండేళ్ల ముందు నుంచే విజయనగరంపై ఫోకస్ పెంచింది నెల్లిమర్ల గురించేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

English Title
AP Minister Ganta Srinivasa Rao Political History

MORE FROM AUTHOR

RELATED ARTICLES