ఆసక్తికరమైన చర్చకు దారి తీసిన ఏపీ ప్రభుత్వం

Submitted by lakshman on Sat, 12/23/2017 - 18:35

ఏపీ సర్కారు జారీ చేసిన ఓ సర్క్యులర్ ఆసక్తికరమైన చర్చకు తావిస్తోంది. జనవరి ఒకటో తేదీన దేవాలయాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లేవీ ఉండరాదని, అలంకరణల పేరిట డబ్బు తగలేయరాదని ఏపీ సర్కారు ఫర్మానా జారీ చేసింది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా.. ఇంకా క్రీస్తు శకాన్ని ఫాలో అవుతున్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఏపీ సర్కారు జనవరి 1 ప్రాధాన్యత తగ్గించి.. క్రమంగా ఉగాదికే పెద్దపీట వేస్తుందా? క్రీస్తు శకం స్థానంలో శాలివాహన శకాన్ని మళ్లీ అమలు చేస్తారా? ప్రపంచమంతా గ్లోబల్ సిటీగా మారుతున్న తరుణంలో.. ఏపీ సర్కారు ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? ఈ అంశాలే ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. 
తెలుగు సంప్రదాయాలకు, తెలుగు ప్రాచీన పద్ధతులకు పెద్దపీట వేయాలనుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఆ దిశగా ఓ కొత్త సర్క్యులర్ ను జారీ చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చిన తాజా ఫర్మానా.. దేవాలయాల్లో జనవరి ఫస్ట్ కు సంబంధించిన ఏర్పాట్లపై నిషేధం విధిస్తోంది. గుళ్లలో జనవరి ఫస్ట్ కోసం ప్రత్యేకంగా అలంకరణలు చేయడం, పండుగలు చేసుకోవడం, అందుకోసం లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని తగలేయడం సరికాదంటూ ఆ లేఖ ఆక్షేపిస్తోంది. మరో అడుగు ముందుకేసిన ఏపీ దేవాదాయ శాఖ.. జనవరి ఫస్టున శుభాకాంక్షలు కూడా చెప్పుకోరాదంటూ అన్ని దేవాలయాల ఈవోలకు, ఇతర అధికారులకు ఓ లేఖను పంపించింది. 
తాజా సర్క్యులర్ లో ఆసక్తికరమైన పలు అంశాలు కూడా ప్రస్తావించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లయినా.. బ్రిటిషర్స్ ద్వారా అలవాటైన క్రీస్తుశకాన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నామన్న దేవాదాయ శాఖ... ఆ అలవాటు మార్చుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇండైరెక్టుగా సూచిస్తూండడం విశేషం. తెలుగు సంవత్సరాది ఉగాదే అవుతున్నందున.. ఆ రోజునే దేవుడి ప్రసాదంగా పచ్చడి తీసుకోవడం మన సంప్రదాయమని.. అదే కొనసాగించడం ఉత్తమం, ఆచరణయోగ్యం అంటూ పేర్కొంది. 
 ఏపీ సర్కారు నిర్ణయాన్ని పలువురు పండితులు, సంప్రదాయవాదులు స్వాగతిస్తున్నారు. 
 ఇక బాబు ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా సర్క్యులర్ తో పలు అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుసరిస్తున్న క్రీస్తుశకం స్థానంలో తెలుగువారు ఇప్పటికే అనుసరించిన శాలివాహన శకాన్ని మళ్లీ తెరమీదికి తెస్తారా? ఒకవేళ ఆ తలంపు ప్రభుత్వానికి ఉన్నా.. ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అంతేకాదు.. ఈ లేఖ ద్వారా జనవరి 1వ తేదీకి ఉన్న ప్రాశస్త్యం కూడా ప్రశ్నార్థకమవుతోంది. క్రీస్తు శకానికి ఏది ప్రామాణికం? క్రీస్తు పుట్టిన రోజేనా? అలాంటప్పుడు డిసెంబర్ 25 కాకుండా జనవరి 1వ తేదీనే సంవత్సరాదిగా ఎలా తీసుకున్నారు? ఇలాంటి మూలాంశాలు కూడా చర్చనీయంగా మారుతున్నాయి. మరోవైపు.. జనవరి 1ని ఉగాది కన్నా ఘనంగా ప్రపంచమంతా ఉత్సవాలు జరుపుకొంటున్నారు. హిందువులందరూ మత భావనలతో పని లేకుండా దేవాలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకొంటున్నారు. ఆ సంవత్సరమంతా తమకు శుభాలు కలగాలని మొక్కుకుంటున్నారు. భక్తుల తాకిడిని కాదనలేక తిరుమల, శ్రీకాళహస్తి, బెజవాడ దుర్గ గుడి వంటి ప్రముఖ దేవాలయాలు కూడా ప్రత్యేక ఏర్పాట్లూ చేస్తూ వస్తున్నాయి. 
 దేవాలయాల్లో ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరగకూడదని చెబుతున్న తాజా లేఖ స్ఫూర్తిని హిందువులు ఎంతవరకు ఆమోదిస్తారు? ఇదే స్ఫూర్తి ఏపీ సర్కారు అన్ని పాలనాపరమైన అంశాలకు వర్తింపజేస్తుందా? తెలుగు అంకెలను, తెలుగు కేలండర్ ను అమలు చేస్తుందా? ఒకటో తేదీన కాకుండా పాడ్యమి నాడే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తారా?.. ఇలాంటి అంశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

English Title
AP Government bans New Year celebration in Temples

MORE FROM AUTHOR

RELATED ARTICLES