తెలంగాణలో వెనుకబడిన తరగతుల్లో చేరనున్న కొత్త కులాలు

తెలంగాణలో వెనుకబడిన తరగతుల్లో చేరనున్న కొత్త కులాలు
x
Highlights

తెలంగాణలో వెనుకబడిన తరగతుల్లో కొత్త కులాలు చేరనున్నాయి. దీనికి సంబంధించి బీసీ కమిషన్ చర్యలు చేపట్టింది. దాదాపు 30కి పైగా కులాలను బీసీ జాబితాలో...

తెలంగాణలో వెనుకబడిన తరగతుల్లో కొత్త కులాలు చేరనున్నాయి. దీనికి సంబంధించి బీసీ కమిషన్ చర్యలు చేపట్టింది. దాదాపు 30కి పైగా కులాలను బీసీ జాబితాలో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన పరిశీలన కోసం బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది.

చాలా సంవత్సరాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలు బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. తాజాగా ఈ కులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు రంగం సిద్ధమైంది. బీసీ కమిషన్ చైర్మన్ రాములు నేతృత్వంలోని సభ్యుల బృందం హైదరాబాద్‌లో ప్రతిపాదిత కులాల సభ్యులు, కుల సంఘాల నేతలతో సమావేశమై వారి జీవన విధానం, ఆర్థిక స్థితిగతుల అంశాలపై చర్చిస్తున్నారు.

బీసీ కమిషన్ ఈ నెల 5వ తేదీ వరకు సలహాలు, సూచనలు స్వీకరించనుంది. 11వ తేదీ లోపు ప్రతిపాదిత కులసంఘాల పెద్దలతో సమావేశమై చర్చిస్తారు. గతంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ కమిషన్లు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా బీసీ కమిషన్ వీరి చేరికపై పూర్తిస్థాయి అంశాలను లోతుగా అధ్యయనం చేయనుంది.

ఇప్పటికే బీసీల్లో 112 కులాలు ఉండగా అనాథలతో కలిపి 113 కులాలుగా పరిగణిస్తున్నారు. తాజాగా గౌడ జెట్టి, బైలు కమ్మర, కడిగి, సాధనా సుర, శ్రీక్షత్రియ రామజోగి, పాపల, పనస, పాండవుల, తెర చీరల, అరవ కోమటి, ఆహిరి యాదవ్, గొవిలి, సారొళ్లు, పెక్కర వంటి 33 కులాలు తమను బీసీ జాబితాలో చేర్చమని కోరుతున్నాయి. ఈ కులాలకు చెందిన వారు బీసీ కమిషన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.

సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఈ సంచార జాతుల కులాలను బీసీ జాబితాలో చేరిస్తే ప్రభుత్వ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. రెండు నెలల్లోపు దీనిపై నివేదిక ఇస్తే ఇక ప్రభుత్వ ఆమోదమే మిగిలి ఉంటుంది. ఇందుకు సంబంధించి బీసీ కమిషన్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories