ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా హీరో : కమల్‌

Submitted by arun on Wed, 02/21/2018 - 12:41
Kamal

తమిళ సీనియర్ నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయ యాత్ర షురూ అయ్యింది. ఉదయం రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ఇంటికి వెళ్ళిన కమల్...కలాం సోదరుడు మహమ్మద్‌ ముతుమీర లెబ్బాయ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనకు చేతి గడియారం కానుకగా ఇచ్చారు. తొలిసారి కలాం ఊరికి వచ్చిన కలామ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కలాం కుటుంబ సభ్యుల్ని కలిశాక కమల్ హాసన్... రామేశ్వరంలో మత్య్సకారులతో సమావేశమయ్యారు. కలాం వంటి గొప్ప వ్యక్తి పుట్టిన రామేశ్వరం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కమల్‌ అన్నారు. ఇవాళ సాయంత్రం రాజకీయ పార్టీ ప్రకటించనున్న కమల్ హాసన్ ముందుగా..కలాం సమాధికి నివాళులర్పించి అక్కడి నుంచి రోడ్‌ షో ప్రారంభించారు. అనంతరం స్థానిక హయత్ ప్లే్‌స్‌ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. కమల్‌ రాగానే అభిమానులు ‘సీఎం వచ్చారు’ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ..‘నేను మహాత్మా గాంధీ వీరాభిమానిని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా హీరో. మంగళవారం రాత్రి చంద్రబాబు నాకు ఫోన్‌ చేశారు. ప్రజలకు ఏం చేయాలి అన్న విషయాల గురించి సలహాలు ఇచ్చారు. రాజకీయ యాత్రలో భాగంగా కార్యకర్తలు, అభిమానులు నన్ను కలవడానికి వచ్చి శాలువాలు కప్పుతున్నారు. ఇంకెప్పుడూ ఇలా నాకు శాలువాలు కప్పవద్దు. నేను మీ శాలువాగా మారి మీకు రక్షణ కల్పిస్తాను.’

‘రామేశ్వరంలో కలాం చదివిన పాఠశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ పాఠశాల యాజమాన్యం నాకు అనుమతి ఇవ్వలేదు. పాఠశాలకు రానివ్వకుండా అడ్డుకోగలిగారు కానీ నేను నేర్చకోవాలనుకున్న విషయాలను మాత్రం అడ్డుకోలేరు. తమిళనాడు ప్రజల గుండెల్లో నేనున్నాను. ఇప్పుడు వారి ఇళ్లల్లోనూ ఉండాలనుకుంటున్నాను. సినిమాలకు,  రాజకీయాలకు పెద్ద తేడా లేదు. రెండు రంగాలు ప్రజల కోసమే. కానీ సినిమాల కంటే రాజకీయాల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బంతా ప్రజలదే. కలాం చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకు ఎందుకు రాలేదు అని చాలా మంది అడుగుతున్నారు. సాధారణంగా నేను అంత్యక్రియలకు హాజరుకాను.’ అని చెప్పుకొచ్చారు కమల్‌.

English Title
ap cm Chandrababu is my hero says Kamal Haasan

MORE FROM AUTHOR

RELATED ARTICLES