చంద్రబాబు పాకిస్తాన్‌ ఏజెంట్

చంద్రబాబు పాకిస్తాన్‌ ఏజెంట్
x
Highlights

తెలుగుదేశం, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయ్. ప్రత్యేక హోదా అంశం రెండు పార్టీల మధ్య చిచ్చు రేపుతూనే ఉంది. కేంద్రం ఆర్థిక సాయం...

తెలుగుదేశం, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయ్. ప్రత్యేక హోదా అంశం రెండు పార్టీల మధ్య చిచ్చు రేపుతూనే ఉంది. కేంద్రం ఆర్థిక సాయం చేద్దామనుకున్నా ఏపీ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడాలని టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సాయం చేద్దామనుకున్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు విమర్శించారు. నిధులు ఇస్తున్నా ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి కేంద్ర సాయం అనే పుస్తకాన్ని విజయవాడలో హరిబాబు ఆవిష్కరించారు. 16వేల కోట్ల ఆర్థిక సాయం కేంద్రం అందిస్తామంటే దాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు. హోదా నినాదాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తాయన్న భయంతో రాష్ట్రానికి వచ్చే ఆర్థిక సాయాన్ని తీసుకోవడం లేదని హరిబాబు అన్నారు. బీజేపీకి చెందిన మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చంద్రబాబును టార్గెట్ చేశారు. ఆయన ఏకంగా చంద్రబాబునాయుడు పాకిస్తాన్‌ ఏజెంట్‌ అని ఆరోపించారు.

బీజేపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్‌, బుద్దా వెంకన్నలు ఫైరయ్యారు. బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ స్థాయి మరచి మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయ్యారన్న సంగతి మరిచిపోవద్దన్నారు. విష్ణుకుమార్ రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తెలుగు ప్రజల తరపున మాట్లాడకుండా కేంద్రానికి హరిబాబు కొమ్ము కాస్తున్నారని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ,బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయ్. నేతల మాటల తూటాలు వ్యక్తిగత విమర్శలవైపు వెళుతుండటంతో రెండు పార్టీల రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories