హోదా రాకపోవడానికి కారణం గత ప్రభుత్వమే : ఏపీ ముఖ్యమంత్రి జగన్

హోదా రాకపోవడానికి కారణం గత ప్రభుత్వమే : ఏపీ ముఖ్యమంత్రి జగన్
x
Highlights

ఆంద్ర ప్రదేశ్ శాసనసభలో ప్రత్యేక హోదా కావాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం పై అసెంబ్లీలో ప్రకటన చేశారు....

ఆంద్ర ప్రదేశ్ శాసనసభలో ప్రత్యేక హోదా కావాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం పై అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా ఎలా నష్టపోయిందీ.. హైదరాబాద్ లేకపోవడం వల్ల ఏపీ ప్రజలకు వచ్చిన ఇబ్బందులు ఎలాంటివి.. వంటి విషయాలను అయన తన ప్రకటనలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక హోదా విషయంపై ఇలా సభలో ఇలా అన్నారు..

''గత శాసనసభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల .. ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే కావాలని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానం పంపుతున్నాం. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అప్పటి ప్రభుత్వం సరిదిద్దక పోగా .. ఆ అన్యాయాలు మరింతగా పెరగటానికి కారణమైంది. అందుకే ఈరోజు మనమంతా పోరాటం చేయాల్సి వస్తోంది. విభజన ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 59 శాతం జనాభాను, 47శాతం అప్పులను వారసత్వంగా పొందాం. ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే రాజధాని నగరం లేకుండా అతి తక్కువ మౌలిక సదుపాయాలతో మానవ అభివృద్ధి సూచికల్లో వెనుకబడి వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోయాం.

2015 నుంచి 2020 సంవ్సతరాల మధ్యలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాను పరిగణనలోకి తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ.22,113 కోట్లు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. వాస్తంగా గత ఐదేళ్లలో మన రెవెన్యూలోటు రూ.66,362 కోట్లకు పెరిగిపోయింది. ఇది 14వ ఆర్థికసంఘం అంచనా వేసిన దానికంటే మూడు రెట్లు అధికంగా ఉంది. హైదరాబాద్‌ అనేక దశాబ్దాల్లో దేశంలోని ఇతర రాజధాని నగరాల మాదిరిగానే అత్యుత్తమ ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించింది. ఉదాహరణకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి 57వేల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు ఉండగా.. ఇందులో హైదరాబాద్‌ నగరమే రూ. 56,500 కోట్ల ఎగుమతులను అందించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం 14,411గా ఉండగా, ఏపీ తలసరి ఆదాయం 8,398గా మాత్రమే ఉంది. కొత్త రాష్ట్రానికి ఉన్న సవాళ్లు, ఆర్థిక దుస్థితి దృష్టిలో ఉంచుకుని.. ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని సక్షాత్తూ పార్లమెంట్‌లోనే ప్రకటన చేశారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని నేరుగా ఆర్థిక సాయం చేయడం ద్వారా, అభివృద్ధికరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తామని ఆనాడు పార్లమెంట్‌లో చెప్పారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఇది ఆర్థిక, సామాజిక దుస్థితికి దారితీసింది. విభజన సమయంలో రూ.97వేల కోట్లు ఉన్న రాష్ట్ర అప్పు..2018-19 నాటికి రూ.2,58,928 కోట్లకు చేరింది. రుణంపై వడ్డీ ఏడాదికి రూ.20వేల కోట్లు పైగా ఉంటే..దీనికి అదనంగా అసలు రూపంలో మనం చెల్లించాల్సి మొత్తం మరో రూ.20వేల కోట్లు ఉంటుంది.

వెంటనే హోదా ఇవ్వాలి..

గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దలేదు. నీతిఆయోగ్‌లో ప్రధాని, కేంద్రమంత్రిమండలి సమక్షంలో ఇదే కాపీ చదివినిపించా. విభజనతో రాష్ట్రం అన్నిరంగాల్లో నష్టపోయింది. విభజన నష్టాలను ప్రత్యేక హోదా ద్వారానే పూడ్చుకోవచ్చు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి. హోదా వస్తేనే రాయితీలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా జీవనాడి అయినందున జాప్యంలేకుండా వెంటనే ఇవ్వాలని ఐదు కోట్లమంది ప్రజల తరఫున హోదా కావాలని తీర్మానం ప్రవేశపెడుతున్నా'' అని జగన్‌ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories