తెలుగు రాష్ట్రాలను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ...పెరుగుతున్న స్వైన్ ఫ్లూ మరణాలు, కేసులు

x
Highlights

స్వైన్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. స్వైన్ ఫ్లూతో ఏపీలో ఇప్పటి వరకు 13మంది మృతి చెందగా తెలంగాణలో 20 మంది చనిపోయారు. ఇక హైదరాబాద్‌లో 150కిపైగా...

స్వైన్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. స్వైన్ ఫ్లూతో ఏపీలో ఇప్పటి వరకు 13మంది మృతి చెందగా తెలంగాణలో 20 మంది చనిపోయారు. ఇక హైదరాబాద్‌లో 150కిపైగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. చలికాలం ప్రారంభం కావడంతో స్వైన్ ఫ్లూ మరింత విజృంభించే అవకాశం కనిపిస్తోంది

గతంలో కంటే ఈ ఏడాది స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు 78 స్లైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కర్నూలు జిల్లాలో 8 మంది మృత్యువాత పడగా మరో 10 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

విశాఖ నగరంలో 15 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. విశాఖ ఛాతి వ్యాధుల ఆస్పత్రిలో ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు కూడా స్వైన్‌ ఫ్లూ బారినపడ్డారు. రోగులకు వైద్య సేవలు అందించే సమయంలో వీరికి వ్యాధి సోకింది. అలాగే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, పెనుమూరు, వెదురుకుప్పంతో పాటు ఇతర ప్రాంతాల్లో 7 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోనూ స్వైన్‌ ఫ్లూ ప్రభావం కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ఈదరపల్లి గ్రామ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకింది. ఈమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు కాకినాడ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విజయవాడలో రెండు కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలోనూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. 90 శాతం స్వైన్ ఫ్లూ కేసులు, 70శాతం డెంగ్యూ , మలేరియా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 1,426 మలేరియా కేసులు, 2,644 డెంగ్యూ కేసులు, 154 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వ్యాధులు విజృంభిస్తుండటంతో రెండు రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. నసమూహం ఎక్కువగా ఉండే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమాహాళ్ల వద్ద స్వైన్‌ఫ్లూ లక్షణాలు గుర్తించే కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వర లక్షణాలున్న వారు సమీపంలోని వైద్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories