ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిన మోడీ సర్కార్

Submitted by arun on Wed, 07/25/2018 - 11:37
rajnath

అదే మాట,..అదే పాత పాట. కొత్త పలుకు ఒక్కటీ లేదు. ఆ ఒక్కటీ తప్ప...అన్న పాత పల్లవే పాడారు. రాజ్యసభలో ఏపీ సమస్యలపై జరిగిన చర్చ హాట్ హాట్‌గా సాగినా..ఒరిగిందేమీ లేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్రం తేల్చి పడేసింది. నెపం 14 ఆర్థిక సంఘం మీదకు నెట్టేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14 ఆర్థిక సంఘం సిఫార్పులే అడ్డని తప్పించుకునే యత్నం చేసింది. 

విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై రాజ్యసభలో స్వల్ప కాలిక చర్చ వాడివేడిగా జరిగింది. 4 గంటలపాటు జరిగిన చర్చలో ఏపీకి ఇచ్చిన విభజన హామీలు ఎందుకు అమలు కావడంలేదని పార్టీలన్నీ కేంద్రాన్ని నిలదీశాయి. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలను నేటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చర్చను ప్రారంభించిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. మంత్రివర్గ నిర్ణయాలు రాజ్యంగబద్ధమైనవన్న సుజన సహకార స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు.

 సుజన విమర్శల్ని బీజేపీ ఎంపీ జీవిఎల్ నర్సింహరావు తిప్సికొట్టారు. ప్రత్యేక ప్యాకేజీకి సీఎం చంద్రబాబు అంగాకరించారనీ ఇందుకుగానూ ఏపీ చట్ట సభలో ఎన్డీయే ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారని గుర్తు చేశారు. అయినా ప్రత్యేక హోదా  ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీలే ముద్దాయిలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సంజీవని అని వైసీపీ నమ్ముతోందన్న విజయసాయి హోదా సంజీవని కాదని టీడీపీ బాహాటంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రత్యేక హోదా అంశంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటే సుప్రీం అని అలాంటి చోట చేసిన చట్టాలకే విలువ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని 14వ ఆర్థిక సంఘం చెప్పి ఉంటే తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సీఎం రమేశ్ సవాల్ చేశారు. 

చర్చకు సమాధాన మిచ్చిన హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏపీకి ఇచ్చిన గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 90శాతం విభజన హామీలు పూర్తి చేశామన్న కేంద్ర హోం మంత్రి  14 ఆర్థిక సంఘం నిబంధనల కారణంగా హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామని చెప్పుకొచ్చారు. బయ్యారం, కడప స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటుపై కమిటీలు వేశామని విశాఖ రైల్వే జోన్ ఖచ్చితంగా వస్తుందని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. దేశంలోని అన్ని పార్టీలు ప్రత్యేక హోదా ఇస్తారో ఇవ్వరో తేల్చి చెప్పాలని ప్రశ్నించినా కేంద్రం మాత్రం కేంద్ర మాత్రం పాత మాటనే మరోసారి జపించింది. 
 

 

English Title
Andhra Pradesh getting more than what it would have got as special category state: Rajnath Singh

MORE FROM AUTHOR

RELATED ARTICLES