ఎంపీలు, మంత్రుల భేటీలో చంద్రబాబు కీలక నిర్ణయాలు

Submitted by arun on Sat, 06/16/2018 - 11:42
babu

విభజన హామీలపై పోరుకు టీడీపీ మళ్ళీ సిద్ధమౌతోంది.వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని నిర్ణయించింది. ఎంపీలు, మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

అమరావతి ప్రజాదర్బార్‌ హాల్‌లో టీడీపీ ఎంపీలు, మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. 17వ తేదీన  జరిగే నీతి ఆయోగ్‌ సమావేశం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కుట్ర రాజకీయాలపై భేటీలో  చర్చించారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలంతా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. నీతి ఆయోగ్‌ భేటీలో ప్రధాని ప్రసంగం పూర్తయిన వెంటనే ఏపీ అంశాలను ప్రస్తావించి...సమావేశం నుంచి వాకౌట్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. విభజన హామీల విషయంలో ప్రతిపక్ష పార్టీల సీఎంల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబు పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక సీఎంలతో మాట్లాడారు. అలాగే పాండిచ్చేరి, పంజాబ్‌, ఢిల్లీ సీఎంలతో మాట్లాడేందుకు యత్నిస్తున్నారు. 

పొత్తుతో సాధించలేనిది, పోరాటంతో సాధించాలని చంద్రబాబు ఎంపీలకు పిలుపునిచ్చారు. పోరాటంలో ప్రతి నిమిషం అమూల్యమన్న చంద్రబాబు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఏమరపాటు తగదని దిశానిర్దేశం చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం సీఎం రమేష్‌ చేపట్టే దీక్షకు ఎంపీలంతా కడప వెళ్లి సంఘీభావం తెలపాలని చంద్రబాబు సూచించారు. అలాగే  విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని ఉద్ధృతం చేయాలన్నారు. టీడీపీ పోరాటానికి వైసీపీ కూడా తోడు రావాలని ఎంపీలు కోరారు. మొత్తానికి పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందే ఏపీలో మరోసారి హోదా హోరు మార్మోగే అవకాశం కనిపిస్తోంది.  

English Title
Andhra Pradesh CM Chandrababu Naidu to raise special status issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES