మోత్కుపల్లికి ఆంధ్రా నేతల నుంచి మద్దతు

Submitted by arun on Wed, 06/13/2018 - 10:21
Motkupalli

సీనియర్‌ లీడర్‌ మోత్కుపల్లి నర్సింహులు‌ రాజకీయ జీవితం అయోమయంలో పడింది. తెలుగుదేశం నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లిని తెలంగాణలో ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. కనీసం పలకరించడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. అయితే పొరుగు రాష్ట్రం... ఏపీ నుంచి మాత్రం మోత్కుపల్లికి అనూహ్య మద్దతు లభిస్తోంది. హైదరాబాద్‌కి వచ్చి మరీ... మోత్కుపల్లిని కలిసి సంఘీభావం ప్రకటించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

మోత్కుపల్లి నర్సింహులు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఈయన... రాష్ట్ర విభజన తర్వాత దాదాపు కనుమరుగైపోయారు. ఆడపాదడపా మీడియాలో కనిపించినా పట్టించుకునేవారే కరువయ్యారు. తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న మోత్కుపల్లిని ...టీడీపీ సైతం పట్టించుకోకపోవడంతో... తీవ్ర మనోవేదనకు గురై... చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దాంతో తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. టీడీపీతో దశాబ్దాల బంధం తెగిపోవడంతో... బలమైన రాజకీయ వేదిక కోసం చూస్తున్నారు మోత్కుపల్లి. అయితే టీఆర్‌ఎస్‌లో చేరాలని మోత్కుపల్లి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా మోత్కుపల్లిపై ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు మోత్కుపల్లితో అనుబంధమున్న రాజకీయ నేతలు సైతం ఆయన్ను పలకరించడానికి ముందుకురావడం లేదు. మోత్కుపల్లిని కలిస్తే... ఏ వార్త గుప్పుమంటుందోనన్న భయంతో ఆయన్ను కలిసేందుకు ఎవరూ సాహసించడం లేదు.

అయితే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన మోత్కుపల్లి ఏపీ అంతటా తిరిగి బాబు బండారాన్ని బయటపెడతానని ప్రకటించడంతో ఆంధ్రా నేతల నుంచి మద్దతు లభిస్తోంది. టీడీపీ ఓటమి కోసం గ్రామగ్రామాన తిరుగుతానని మోత్కుపల్లి ప్రకటించడంతో చంద్రబాబు వ్యతిరేకులు ఆయన్ను కలిసి చర్చలు జరుపుతున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మోత్కుపల్లి ఇంటికి వచ్చి చర్చలు జరపగా, తాజాగా వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి కూడా మోత్కుపల్లి ఇంటికి వచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి.  చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏపీలో పర్యటిస్తే... పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే మోత్కుపల్లితో భేటీ వార్తల్ని విజయసాయిరెడ్డి ధృవీకరించడంలేదు. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్లుగా ఏపీలో చంద్రబాబు వ్యతిరేకులంతా మోత్కుపల్లికి బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యనేతలు... మోత్కుపల్లిని కలిసి మద్దతు ప్రకటించగా, త్వరలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. 

English Title
andhra leaders support motkupalli narasimhulu

MORE FROM AUTHOR

RELATED ARTICLES