వైసీపీలోకి ఆనం...అక్కడి నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు...?

Submitted by arun on Fri, 07/20/2018 - 13:37

నెల్లూరు రాజకీయం రసపట్టుకొచ్చింది. అదిగో ఇదిగో అంటూ వస్తున్న ఆనం రామ్ నారాయణ రెడ్డి మొత్తానికి సైకిల్ దిగేందకు సిద్ధమయ్యారు. గురువారం ఆయన లోటస్‌ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను కలిసి మంతనాలు సాగించారు. అయితే ఆనం రావూరి నుంచి పోటీ చేస్తారా లేక మరో నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. 

ఆనం బ్రదర్స్‌లో ఒకరు మాజీ మంత్రి, నెల్లూరు రాజకీయాల్లో తలపండిన నాయకుడు రామ్‌ నారాయణరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఆయన లోటస్‌ పాండ్‌లో పార్టీ అధినేత జగన్‌ను కలిశారు. సుమారు గంట పాటు చర్చలు జరిపారు. పార్టీ మారే విషయంలో చాలాకాలం పాటు మౌనంగా ఉన్న ఆనం మొత్తానికి వైసీపీ కండువా కప్పుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండేళ్లుగా అధికార టీడీపీలో ఉన్నా ఆనంకు ఆశించినంత గుర్తింపు రాలేదు. దీంతో ఆరునెలలుగా పార్టీ మారడంపై మదనపడ్డ ఆనం మొత్తానికి ఓ నిర్ణయానికి వచ్చారు. 

ఇటు ఆనం వైసీపీలో చేరుతారన్న ఊహాగానాలు మొదలైనప్పటి నుంచీ నెల్లూరు వైసీపీ నాయకుల్లో కలకలం మొదలైంది. వైసీపీలో చేరడం దాదాపుగా ఓకే అయినా మరి ఆనం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో తనకు రాజకీయ భవిష్యత్ ను ఇచ్చిన రాపూరు ప్రాంతంలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటివరకు ఆ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నట్లే అని చెబుతున్నారు. చైర్మన్ పదవి దక్కించుకోవడంలో అధికార టీడీపీతో పోరాటం చేసి వెంకటగిరిలో ఏకనాయకత్వానికి బీజం వేసిన బొమ్మిరెడ్డి భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. ఆనం వెంట నడుస్తారా లేక అసమ్మతి రాజేస్తారా..? అన్నదే హాట్‌ టాపిక్‌గా మారింది. 

అయితే గతంలో వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్నట్లు పదే పదే ప్రకటించిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పాదయాత్ర సందర్భంగా జగన్ వెంకటగిరికి వచ్చినప్పుడు అన్నీ తానై వ్యవహరించారు. కానీ ఆనం వెంకటగిరి నుంచి పోటీ చేసేందుకు అధిష్టానం ఒప్పుకుంటే.. బొమ్మిరెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరోవైపు గతంలో ఆత్మకూరు నుంచి పోటీ చేసిన ఆనం వైసీపీలోకి రావడంపై మేకపాటి బ్రదర్స్‌కు మింగుడుపడటం లేదు. ఒకానొక సందర్భంలో ఎవరొచ్చినా ఆత్మకూరును వదులుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీంతో ఒకింత పునరాలోచనలో పడ్డ ఆనం వైసీపీ పెద్దల మంతనాలతో ఫ్యాన్‌ కు జై కొట్టారు. 

English Title
Anam Ramanarayana Reddy Meets YS Jagan in Lotus Pond

MORE FROM AUTHOR

RELATED ARTICLES