తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ రెడీ...మొత్తం 119 స్థానాల్లో ...

Submitted by arun on Mon, 09/10/2018 - 11:39
amitshah

తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధమైంది. మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 15న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాలమూరులో నిర్వహించే బహిరంగ సభ తర్వాత తొలి విడతగా 50 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించడానికి రెడీ అవుతోంది. అలాగే ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులను ప్రచారానికి రప్పించేందుకు కసరత్తు చేస్తోంది.

తెలంగాణలో ఎలాగైనా అధిక స్థానాలు సాధించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఉన్న 5 ఎమ్మెల్యే స్థానాలను కాపాడుకోవడంతోపాటు మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా డైరెక్షన్‌ మేరకు తెలంగాణ నేతలు ముందడుగు వేస్తున్నారు. తెలంగాణలో అధిక స్థానాలు గెలుచుకునేలా తానే ప్రచార బాధ్యతలు స్వీకరిస్తానని అమిత్ షా భరోసా ఇవ్వడంతో ఆ దిశగా బీజేపీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

ఈ నెల 15న మహబూబ్ నగర్ సభకు వస్తున్న అమిత్ షా..బీజేపీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. కోర్ కమిటీ సమావేశం తర్వాత అభ్యర్థులను గుర్తించడానికి అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయిలో కమిటీ వేసి త్వరలోనే అభ్యర్థులను నిర్ణయిస్తారు. అయితే ఎన్నికల పొత్తు కోసం తెలంగాణ జనసమితితో ఇటీవల బీజేపీ మంతనాలు జరిగినా చివరికి ఒంటరిగానే 119 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో అనేకమంది అసంతృప్తి వాదులు తమతో సంప్రదిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.

 ఈ నెల 15న మహబూబ్‌నగర్‌లో అమిత్ షా నిర్వహించనున్న మొదటి సభ నుంచే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ప్రచార బాధ్యతలను బీజేపీ ప్రధాన కార్యదర్శులు సంతోష్, ఉపేందర్ యాదవ్ కు అమి త్ షా అప్పగించారు. అలాగే ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారని తెలంగాణ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని కమలదళం చెప్పుకొస్తోంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ కొన్ని చోట్ల కాంగ్రెస్‌ బలహీనంగా ఉందని, ఆ స్థానాలపై తాము దృష్టి పెడతామని బీజేపీ నేతలు అంటున్నారు. 

English Title
Amit Shah to kick off poll campaign in Telangana on September 15

MORE FROM AUTHOR

RELATED ARTICLES