రాహుల్, బాబు సభపై ఉత్కంఠ

x
Highlights

మహాకూటమి ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే సోనియాను తీసుకొచ్చి సెంటిమెంట్‌ను పారించిన కూటమి పార్టీలు ఇవాళ్టి నుంచి రాహుల్‌గాంధీతో ప్రచారం...

మహాకూటమి ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే సోనియాను తీసుకొచ్చి సెంటిమెంట్‌ను పారించిన కూటమి పార్టీలు ఇవాళ్టి నుంచి రాహుల్‌గాంధీతో ప్రచారం నిర్వహించనుంది. తొలుత కొడంగల్‌లో నియోజకవర్గంలోని కోస్గీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. తర్వాత ఖమ్మం సభలో చంద్రబాబుతో కలిసి వేదికను పంచుకోనున్నారు. తెలుగు రాజకీయాల్లో ఆసక్తికరమైన సన్నివేశం మరికొన్ని గంటల్లోనే ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికపైకి టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, రాహుల్‌గాంధీ కనిపించబోతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇవాళ ఖమ్మంలో జరగనున్న మహాకూటమి సభలో ఇద్దరు నాయకులు కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఈ సమావేశానికి కూటమి పార్టీల నుంచి ప్రముఖ నాయకులంతా హాజరుకానున్నారు.

ఖమ్మంలోని SR AND BGNR కాలేజీ మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలా 30 నిముషాలకు రాహుల్‌గాంధీ, చంద్రబాబు నాయుడు వేర్వేరు హెలికాప్టర్లలో చేరుకోనున్నారు. పెద్ద నాయకులంతా హాజరుకానున్న ఈ సమావేశానికి జనసమీకరణ కోసం కూడా అన్ని పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా సరిహద్దు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాలు తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

జాతీయస్థాయిలో బీజేపీ యేతర పార్టీలను ఏకం చేయాలన్న సంకల్పంతో ఇటీవలే రాహుల్‌ను కలిసిన చంద్రబాబు ఇవాళ ఒకే వేదికపైకి రానుండటంతో రాష్ట్ర, జాతీయ రాజకీయాలను ప్రస్తావిస్తారని చెబుతున్నారు. దేశ చరిత్రలోనే ఇదో అద్భుతమైన ఘట్టంగా నిలుస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు నామా నాగేశ్వర్‌రావు తెలిపారు. ఖమ్మం సభ తర్వాత హైదరాబాద్‌ లో కూడా ఇద్దరు నాయకులు రోడ్డు షోలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలా 30 నిముషాలకు అమీర్‌పేట్‌ సత్యం థియేటర్‌ సర్కిల్‌లో, 6 గంటలా 45 నిముషాలకు నాంపల్లి బహిరంగ సభల్లో పాల్గొంటారు. కాంగ్రెస్‌, టీడీపీతో పాటు కూటమి పార్టీల నాయకులు రాహుల్‌, చంద్రబాబు సభలను విజయవంతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories