ఆన్ లైన్ లో షేక్ చేస్తున్న మరో డెత్ గేమ్...భారత్ లోకి వచ్చేస్తోంది మీ పిల్లలు జాగ్రత్త

ఆన్ లైన్ లో షేక్ చేస్తున్న మరో డెత్ గేమ్...భారత్ లోకి వచ్చేస్తోంది మీ పిల్లలు జాగ్రత్త
x
Highlights

ఛాలెంజ్, సవాల్‌, గేమ్‌.. అది ఏదైనా ఆటవరకు పరిమితమైతే బాగుంటుంది. కానీ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తే..? ప్రపంచంతో పాటు.. మనదేశాన్ని కుదిపేసిన బ్లూ...

ఛాలెంజ్, సవాల్‌, గేమ్‌.. అది ఏదైనా ఆటవరకు పరిమితమైతే బాగుంటుంది. కానీ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తే..? ప్రపంచంతో పాటు.. మనదేశాన్ని కుదిపేసిన బ్లూ వెల్‌ గేమ్‌.. మది నుంచి చెరిగిపోకముందే.. అలాంటిదే ప్రాణాలను బలితీసుకునే మరో గేమ్‌ తెరపైకి వచ్చింది. అదే మోమో గేమ్‌. వస్తూనే అందరితో అమ్మో.. మోమో అనిపిస్తోంది.

బ్లూ వెల్‌ చిన్నారులనే టార్గెట్‌ చేసుకుని వచ్చిన గేమ్‌. తొలుత టాస్కులు ఇచ్చి తర్వాత పిల్లలను డీప్రెషన్‌కు లోనయ్యేలా చేస్తుంది. తర్వాత చివరి టాస్క్‌లో మాత్రం చేతిపై షార్క్‌ బొమ్మను వేసుకోవాలి. దాన్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత ప్రాణాలు తీసుకోవాలి. ఇలా భయంకరమైన ఈ గేమ్‌ బాధితదేశాల్లో మనదేశం కూడా ఉంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. వేలాది మంది చిన్నారులు దీని బారిన పడ్డారు.

అయితే అలాంటి డెడ్లీ గేమ్‌ మరొకటి మనకొంప ముంచేందుకు వచ్చింది. వారం కూడా కాలేదు సోషల్‌ మీడియాలో అదో హాట్‌ టాపిక్‌ అయి కూర్చుంది. టీనేజర్సే టార్గెట్‌గా మోమో గేమ్‌ పేరుతో సూసైడ్‌ ఛాలెంజ్‌ను విసురుతున్నారు కొందరు మాయగాళ్లు. ప్రస్తుతం వాట్సాప్‌లో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ఆన్‌లైన్‌ గేమ్‌కు ఓ వికృత రూపం ఉన్న ముఖాన్ని జోడిస్తున్నారు. పక్షి కళ్లు మనిషి ముఖం కలిసున్న భయంకరమైన ఈ బొమ్మతాలూకు ముఖాన్ని ఉపయోగిస్తూ కొందరు మాయగాళ్లు మోమో ఛాలెంజ్‌ గేమ్‌ను క్రియేట్ చేశారు. తొలుత వాట్సాప్‌ లో మోమో పేరుతో ఓ మెస్సేజ్‌ వస్తుంది. దానికి మనం రిప్లై ఇచ్చామా అంతే వారి వలకు చిక్కినట్లే. బ్లూ వెల్‌ ఛాలెంజ్‌ లాగే ఇక్కడ కూడా రకరకాల టాస్కులిచ్చి మనల్ని వారి గుప్పిట్లోకి లాక్కుంటారు.

మొదట్లో తెలియని నెంబర్ల నుంచి మెస్సేజ్‌లు రావడం రిప్లై ఇవ్వాలంటూ ఛాలెంజ్‌లు విసరడం ఆ తర్వాత పూర్తి చేయాలంటూ ఇంట్రెస్టింగ్ టాస్కులు పంపించడం జరుగుతుంది. అయితే ఛాలెంజ్‌ను ఒప్పుకుని మధ్యలో నిలిపేసినా లేకపోతే టాస్క్‌ను పూర్తి చేయలేకపోయినా బెదిరింపు సందేశాలు కూడా పంపిస్తుంటారు. టీనేజర్స్‌ ఇష్టంగా ఆడే గేమ్స్‌ నుంచి చివరకు వారిని ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసే లాస్ట్‌ టాస్క్‌ వరకు ఈ మృత్యుక్రీడ ఉంటుంది. చిట్టచివరన ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆ దృశ్యాలను వీడియో తీయాలి. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే మోమో గేమ్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసినట్టే. వారం క్రితం అర్జెంటీనాలో ఓ అమ్మాయి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా పోలీసులు ఆమె ఫోన్‌ను హ్యాక్‌ చేస్తే ఆమె మోమో గేమ్‌ ఆడినట్లు తేలింది. అప్పుడే మోమో ఛాలెంజ్‌ అనేది ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆత్మహత్య సంబంధించిన దృశ్యాలను వీడియో కూడా తీసింది. దాన్ని పరిశీలించిన పోలీసులు ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ఎవరో ప్రోత్సహించినట్లు స్పష్టమవుతుందని తెలిపారు.

అయితే ఈ మోమో ఛాలెంజ్‌ను ఎక్కడి నుంచి ఆపరేట్‌ చేస్తున్నారనేది ఇంతవరకు గుర్తించలేదు. మొత్తం మీద ఏడు నెంబర్ల నుంచి మెస్సేజులు వస్తున్నట్లు గుర్తించారు. కానీ మోమో గేమ్‌ ప్రభావం మాత్రం అర్జెంటీనా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. మనదేశానికైతే ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వకపోయినా పోలీసులు మాత్రం హెచ్చరిస్తున్నారు. ఇది ఆన్ లైన్ గేమ్ కావడంతో ఇంకా భారత్ లోకి రాలేదని నమ్మకంగా చెప్పే పరిస్థితి మాత్రం లేదు. ఏదైనా ఘటన వెలుగు చూసినప్పుడు మాత్రమే దీన్ని కూడా మనదేశంలోనూ ఆడుతున్నారనే విషయం గుర్తించగలుగుతాం. అందుకే ఈ గేమ్ విషయంలో జాగ్రత్త అంటున్నారు పోలీసులు. కొత్త నెంబర్లు లేదా తెలియని నెంబర్ల నుంచి ఎలాంటి మెస్సేజులు వచ్చినా రిప్లై ఇవ్వొద్దని గట్టిగా చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సోషల్‌ మీడియాలో ఏ మేర యాక్టీవ్‌గా ఉన్నారో నిత్యం కనిపెట్టుకోవాలని సూచిస్తున్నారు.

అయితే ఈ మోమో గేమ్‌పై మరో ప్రచారం కూడా ఉంది. అసలు మోమో చాలెంజ్ అనేదే లేదని ఆన్‌లైన్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అవతలి వ్యక్తి ఫోన్‌లోని సమాచారాన్ని దొంగిలించేందుకే వాటిని పంపుతున్నట్టు చెప్పుకొస్తున్నారు. మోమో అనేది గేమ్ కాదు, చాలెంజ్‌ కాదని మరో వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఎలా చూసినా మోమో అనేది డెత్ గేమైనా కావొచ్చు లేదంటే మన వ్యక్తిగత సమాచారాన్ని దోచేసే మరో యాప్ కావొచ్చు. ఏదైనా కానీ మోమోతో మాత్రం జాగ్రత్త అంటున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
Next Story
More Stories