టీఆర్ఎస్ కు చెక్ పెట్టిన ధర్మపురి అర్వింద్

టీఆర్ఎస్ కు చెక్ పెట్టిన ధర్మపురి అర్వింద్
x
Highlights

దేశ వ్యాప్తంగా అనూహ్య ఫలితాల్లో ముందు వరుసలో ఉండే ఇందూరు ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. తొలిసారిగా కమలం వికసించింది. బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్...

దేశ వ్యాప్తంగా అనూహ్య ఫలితాల్లో ముందు వరుసలో ఉండే ఇందూరు ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. తొలిసారిగా కమలం వికసించింది. బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ 70 వేల 875 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అన్ని రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది..

నిజామాబాద్ ఓటర్లు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపి కవితపై బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ 70 వేల 875 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అభ్యర్ధులే గెలిచిన నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభనియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లోనూ బంపర్ విక్టరీ సాధించిన టీఆర్ఎస్ కు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ చెక్ పెట్టారు.

రైతులు పెద్ద సంఖ్యలో పోటీకి దిగడంతో నామినేషన్ల సమయంలోనే దేశ వ్యాప్తంగా ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. మోడీ ప్రభావం. రైతు సమస్యలపై అధికార పార్టీ నిర్లక్ష్యం కాంగ్రెస్ అంతర్గత సహాకారం వంటి అంశాలు అర్వింద్ కు కలిసి వచ్చాయి. నిజామాబాద్, పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్ల , జగిత్యాల, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యత రాగా ఒక్క నిజామాబాద్ అర్బన్ లో మాత్రమే టీఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యత లభించింది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలించినట్లయితే ఆర్మూర్ లో బీజేపీకి 74,472 ఓట్లు, టీఆర్ఎస్ కు 40,844 ఓట్లు వచ్చాయి. మైనార్టీలు అధికంగా ఉన్న బోధన్ లో మొదట్లో టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చినా కౌంటింగ్ పూర్తయ్యే వరకు బీజేపి మెజార్టీ సాధించింది, ఇక్కడ బీజేపీకి 55,279, టీఆర్ఎస్ కు 51,718 ఓట్లు వచ్చాయి.

నిజామాబాద్ అర్బన్ లో బీజేపికి 60,700, టీఆర్ఎస్ కు 67,849, నిజామాబాద్ రూరల్ లో బీజేపికి 77,443 ఓట్లు రాగా టీఆర్ఎస్ కు 64,258 ఓట్లు వచ్చాయి. బాల్కొండలో బీజేపీకి 68,064 ఓట్లు, టీఆర్ఎస్ కు 56 వేల 502 ఓట్లు వచ్చాయి. జగిత్యాలలో బీజేపి-66,179, టీఆర్ఎస్-58,413, కోరుట్లలో బీజేపీ 77,023, టీఆర్ఎస్ 57 వేల 064 ఓట్లు సాధించాయి.

ఇక పోస్టల్ బ్యాలెట్ లోనూ బీజేపీ హవా కొనసాగించింది. బీజేపీకి 821 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 125, కాంగ్రెస్ కు 50 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ కు 48,0584 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్ధి కవితకు 4,09709 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కి 69,240ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories