logo

ఐపీఎల్‌‌ మ్యాచ్‌లకు కావేరి సెగ

ఐపీఎల్‌‌ మ్యాచ్‌లకు కావేరి సెగ

కావేరి నదీ జలాల వివాదం ఐపీఎల్‌‌ను తాకింది. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలంటూ పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోన్న తమిళ పార్టీలు, ప్రజాసంఘాలు ఐపీఎల్‌ మ్యాచ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించాయి. తాగునీటి కోసం తాము ఆందోళనలు చేస్తుంటే చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఎందుకంటూ కావేరి నిరసనకారులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈరోజు మ్యాచ్‌ జరిగే చెన్నై చిదంబరం స్టేడియాన్ని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు.

ఈరోజు చెన్నైలో జరగనున్న చెన్నైసూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌‌ను అడ్డుకుంటామని తమిళ సంఘాలు ప్రకటించడంతో చిదంబరం స్టేడియం దగ్గర భద్రతను కట్టుదిట్టంచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీసీసీఐ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. స్టేడియం చుట్టూ పెద్దఎత్తున బలగాలను మోహరించారు. నలుపు రంగు దుస్తులు వేసుకొని ఎవరైనా స్టేడియానికి వస్తే అనుమతించొద్దని ఆదేశించింది. చెన్నై పోలీసులు కూడా స్టేడియం పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.


తమిళ సంఘాల పిలుపుతో అల్లర్లు చెలరేగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కావేరి నిరసనకారులు మ్యాచ్‌ను అడ్డుకునే అవకాశముందని, స్టేడియంలో అలజడి సృష్టించే ఛాన్సు ఉందన్నారు. స్టేడియంలో గందరగోళం సృష్టించేందుకు నిరసనకారులు పెద్దఎత్తున మ్యాచ్‌ టికెట్లను కొనుగోలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరికలతో స్టేడియం లోపలా బయటా సుమారు 4వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

తాగునీటి కోసం తాము ఆందోళనలు చేస్తుంటే చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఎందుకంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రశ్నించారు. చెన్నై తరపున ఆడే ఆటగాళ్లంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని సూచించారు. క్రికెట్‌ అభిమానులు స్టేడియానికి వెళ్లకుండా కేంద్రానికి నిరసన తెలపాలని రజనీ పిలుపునిచ్చారు. అయితే రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు పునరాగమనం చేయడం, అదే సమయంలో సొంత మైదానంలో ఆడబోతుండటంతో అభిమానులు పెద్దఎత్తున స్టేడియానికి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దాంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.


arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top