వైసీపీలో బ్రాండ్ అంబాసిడర్లుగా నలుగురు నేతలు

Submitted by arun on Wed, 01/10/2018 - 13:56

వైసీపీలో ఆ పార్టీ అధినేత జగన్ తర్వాత.. నలుగురు నేతలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం జనంలోకి తమ వాయిస్ వినిపిస్తూ.. ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. సమయం వచ్చినప్పుడల్లా ఆ నలుగురే మైక్‌ల ముందు మాట్లాడుతున్నారు. ఇంతకీ.. ఎవరా నలుగురు.. ? వాళ్ల టార్గెట్ ఏంటి? 

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ. ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ తర్వాత అంత స్థాయిలో ఓ నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు సర్కార్‌పై విల్లును ఎక్కుపెడుతున్నారు. ఆ నలుగురు ఎవరంటే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, ఇంకొకరు ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన నగరి ఎమ్మెల్యే రోజా. ఇప్పుడీ నలుగురు ఆ పార్టీలో ఫేమస్ లీడర్స్.  

నిత్యం జనం సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ తీరును ఎండగడుతూ కోర్టు మెట్లెక్కేందుకు ఆర్కే, తెలుగుదేశం పార్టీని, సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసేందుకు కొడాలి నాని, చంద్రబాబు హామీల వైఫల్యంపై యువతను ఆకట్టుకునేందుకు అనిల్ యాదవ్‌లకు జగన్ అంతర్గత ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.  

ఈ ముగ్గురితోపాటు ఎమ్మెల్యే రోజా కూడా జగన్ ఆలోచనలు, పార్టీ విధానాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. మహిళా సమస్యలు, డ్వాక్రా రుణమాఫీతో పాటు చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు చేస్తూ అధినేత ఆదేశాలను పాటిస్తున్నారు రోజా. 

అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై అన్ని ప్రాంతాల్లో పర్యటించి, వాటిపై గళమెత్తాలని జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ నలుగురి వల్ల పార్టీకి మైలేజ్‌తోపాటు డ్యామేజ్ అంతే స్థాయిలో అవుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అందువల్లే పార్టీ సీనియర్లైన బొత్స, ఉమ్మారెడ్డి, అంబటి, ధర్మాన, పార్థసారధి లాంటి వారిని అప్పుడప్పుడు రంగంలోకి దింపి.. అధికార పార్టీపై ఎటాక్ చేయిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. 

English Title
4 dyanamic leaders in ycp

MORE FROM AUTHOR

RELATED ARTICLES