ఈ కుటుంబానికే ఎందుకిలా ?

ఈ కుటుంబానికే ఎందుకిలా ?
x
Highlights

మనిషిని సృష్టించింది దేవుడంటారు. దేవుడు సృష్టించిన మనిషి తప్పు చేస్తే దండించే అధికారం ఉంది. అదే మనిషిని లోపంతో పుట్టిస్తే ఎవరిది తప్పు? తప్పెవరిదైనా...

మనిషిని సృష్టించింది దేవుడంటారు. దేవుడు సృష్టించిన మనిషి తప్పు చేస్తే దండించే అధికారం ఉంది. అదే మనిషిని లోపంతో పుట్టిస్తే ఎవరిది తప్పు? తప్పెవరిదైనా అనుభవించాల్సింది మాత్రం ఆ వ్యక్తులే. ఇప్పుడీ ఉపోద్ఘాతం వెనుక ఓ బలమైన కారణం ఉంది. మనిషిలో అన్నీ సక్రమంగా ఉంటేనే ఎన్నో వంకలు పెడుతుంది ఈ సమాజం. అలాంటిది లోపమనేది ముఖంపైనే కనిపిస్తుంటే... ఆ లోపాన్ని చూసి ఈ గుడ్డి సమాజం వెక్కిరిస్తుంటే... ఆ బాధ ఎలా ఉంటుంది. అది అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది. సరిగ్గా ఇలాంటి దయనీయ పరిస్థితినే ఎదుర్కొంటోంది ఈ కుటుంబం. కొద్దిరోజుల క్రితమే కుటుంబంలో బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టినందుకు సంతోషపడాలో, తమ కుటుంబాన్ని వేధిస్తున్న అదే లోపంతో పుట్టినందుకు బాధపడాలో తెలియని వింత పరిస్థితి వీళ్లది. పూణెలోని ఓ కుటుంబం విచిత్ర సమస్యతో బాధపడుతోంది. ఒంటి నిండా వెంట్రుకలతో ఈ కుటుంబంలో పుట్టిన మహిళలు అద్దంలో ముఖం చూసుకోవడానికే భయపడుతున్నారు. తమ ముఖం తామే చూసుకోలేని పరిస్థితిలో కుమిలిపోతున్నారు. పుణెలో ఓ కుటుంబమంతా జన్యుపరంగా వచ్చిన ఓ అరుదైన లోపంతో బాధపడుతోంది.

ఈ లోపం వల్ల తమ కుటుంబంలో పుట్టే సంతానం ఒంటి నిండా వెంట్రుకలతో పుడుతున్నారు. దాదాపు కోటి మందిలో ఒకరికి ఇలాంటి సమస్య ఉంటుంది. దీన్నే వైద్య పరిభాషలో హైపర్‌ట్రైకోసిస్ యునివర్సలిస్ అంటారు. మనీషా సంభాజీ రౌత్ అనే ఈ 22 ఏళ్ల మహిళ జన్యుసంబంధ వ్యాధితో బాధపడుతోంది. ఈమెకు ఈ మధ్యే బిడ్డ పుట్టింది. బిడ్డ కూడా తనలాగే వెంట్రుకలతో పుట్టడంతో తల్లడిల్లిపోయింది. కేవలం మనీషానే కాదు ఆమె అక్క సవిత(30), చెల్లి సావిత్రి(19) కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మనీషా తన కుటుంబం యొక్క హృదయ విదారక కథను వివరించింది. తనను, తన తోబుట్టువులను దెయ్యం, ఎలుగుబంటి, కోతి అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఏడిపించారని ఆమె తెలిపింది. తనకు పుట్టిన బిడ్డ కూడా తన లాగే పుట్టడం హృదయాన్ని ముక్కలు చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

గ్రామస్థులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని... తన కొడుకునైనా మనిషిగా గుర్తిస్తే చాలని ఆమె కన్నీళ్లు దీనంగా చెబుతున్నాయి. ఆ మాటలు విన్న ఎవరికైనా కంట కన్నీళ్లు ఆగవు. తనకు విఠల్‌తో గత సంవత్సరం మే 25న పెళ్లయిందని, అతను తననెంతో బాగా చూసుకుంటున్నాడని తెలిపింది. ఇద్దరం కలిసి స్వీట్ షాప్ నడుపుతున్నామని మనీషా చెప్పింది. పెళ్లి సమయంలో తన అత్తయ్య పెద్ద గొడవే చేసిందని ఆమె తెలిపింది. అమ్మాయి ఎలుగుబంటిలా ఉందని, అందంగా లేదని ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పిందని మనీషా విలపించింది. ఆ మాటలకు తన మనసు నొచ్చుకుందని, కోపమొచ్చిందని కానీ ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నానని మనీషా చెప్పింది. తమను ఎలా చూసినా, వెక్కిరించినా ఫర్వాలేదు కానీ తన బిడ్డను మాత్రం దయతో చూడాలని వేడుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories