30ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన అమ్మ

x
Highlights

సరిగ్గా 30 ఏళ్లక్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడికెళ్లిందో తెలియదు. అన్నిచోట్లా వెతికినా ప్రయోజనం లేదు. ఏళ్లు గడిచిపోయాయి....

సరిగ్గా 30 ఏళ్లక్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడికెళ్లిందో తెలియదు. అన్నిచోట్లా వెతికినా ప్రయోజనం లేదు. ఏళ్లు గడిచిపోయాయి. ఎక్కడా ఆమె జాడ కానరాలేదు. చేసేది లేక ఆ కుటుంబం ఆశలు వదులుకుంది. కానీ, ఇప్పుడామె తిరిగి రావడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవదుల్లేవు. మరి ఆమె ఇంతకాలం ఎక్కడుంది.? ఇప్పుడెలా ఇంటికి చేరింది.?

ఈమె పేరు రామక్క. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బండి కొమురయ్య భార్య. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అనారోగ్యానికి గురైన రామక్క 30ఏళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయింది. దీంతో ఓ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు.

అలా ఎక్కడెక్కడో తిరిగిన రామక్క ఆఖరికి మహారాష్ట్రకు చేరింది. అక్కడ సేవా సంకల్ అనే స్వచ్ఛంద సంస్థను ఆమెను చేరదీసింది. కొంత కాలం ఆశ్రయం కల్పించింది. అయినా ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆ సంస్థ నిర్వాహకులు ముంబయిలో మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరిగే వారిని చేరదీసి వైద్యం చేయించే శ్రద్ధా ఫౌండేషన్‌ సభ్యులకు ఆమెను అప్పగించారు. దీంతో కొంతకాలం చికిత్స పొందాక రామక్క ఆరోగ్యం కుదుటపడింది. పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో ఫ్యామిలీ వివరాలను వారికి తెలిపింది రామక్క.

రామక్క ఇచ్చిన సమాచారంతో శ్రద్ధా ఫౌండేషన్ నిర్వాహకులు ఆమెను అంబులెన్స్ ద్వారా ముంబయి నుంచి ఖానాపురంలోని ఇంటికి తీసుకొచ్చారు. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంతకాలం లేదనుకున్న ఆ అమ్మ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అమ్మా అంటూ ఒక్కసారిగా ఏడ్చారు. వారి భావోద్వేగాన్ని చూసి ఊరు ఊరంగా కన్నీరు పెట్టింది. తమ తల్లి ఇంటికి చేరడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు. తమ తల్లిని ఆదరించి, తమ చెంతకు చేర్చిన శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులకు ఆ కుటుంబం చేతులెత్తి దండం పెట్టింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories