మోడీ ముందస్తు సంకేతాలు...నవంబర్‌, డిసెంబర్‌లోనే ఎన్నికలు?

మోడీ ముందస్తు సంకేతాలు...నవంబర్‌, డిసెంబర్‌లోనే ఎన్నికలు?
x
Highlights

ఒకవైపు సంఘ్‌ నుంచి ఒత్తిళ్లు... మరోవైపు పార్టీలో పెరుగుతోన్న వ్యతిరేక వర్గం.... ఇంకోవైపు బలం పుంజుకుంటోన్న ప్రత్యర్ధులు.... వీటన్నంటికీ ముందస్తు...

ఒకవైపు సంఘ్‌ నుంచి ఒత్తిళ్లు... మరోవైపు పార్టీలో పెరుగుతోన్న వ్యతిరేక వర్గం.... ఇంకోవైపు బలం పుంజుకుంటోన్న ప్రత్యర్ధులు.... వీటన్నంటికీ ముందస్తు ఎన్నికలే విరుగుడుగా భావిస్తోంది మోడీ-షా ద్వయం. మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి సత్తా నిరూపించుకుంటే ఇక తిరుగుండదని భావిస్తోన్న మోడీ, అమిత్‌షాలు.... ముందస్తు ఎన్నికలకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ మొదలుపెట్టిన మోడీ-షాలు.... నవంబర్‌, డిసెంబర్లోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలకు మోడీ సర్కార్‌ దాదాపు సిద్ధమైనట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రత్యర్థులు పూర్తిగా కోలుకోక ముందే దెబ్బకొట్టాలని వ్యూహరచన చేస్తోన్న మోడీ-షా ద్వయం ఈ ఏడాది నవంబరు, డిసెంబర్లోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన బీజేపీ తన మిత్రపక్షాలకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందస్తుకు సిద్ధం కావాలంటూ తన సహచరులను అప్రమత్తం చేయడమే కాకుండా ప్రత్యర్థి శిబిరాల్ని నిర్వీర్యంచేసే రాజకీయ ఎత్తుగడలను మోడీ-షా ప్రారంభించారు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ నుంచి రాగానే ముందస్తు వ్యాఖ్యలు చేశారనే మాట వినిపిస్తోంది.

నవంబర్‌, డిసెంబర్‌ల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిషా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. మొత్తం మీద మోడీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే లోక్‌సభతోపాటు 15 రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల వాతావరణం ఏర్పడటంతో ఆయా రాష్ట్రాలు కూడా ముందస్తుకు మొగ్గుచూపే అవకాశముందని భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు ఖాయమైతే ఈ జులైలో జరిగే వర్షాకాల సమావేశాలే 16వ లోక్‌సభకు చివరి సమావేశాలు కానున్నాయి, దాంతో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముందని అంటున్నారు.

బీజేపీ అధ్యక్షుడిగా అమిత్‌‌షా స్థానంలో మరొకరిని నియమించి ఆయనను మంత్రివర్గంలో తీసుకోవాలని సంఘ్‌ నుంచి ఒత్తిడి పెరిగినందుకే ముందస్తుకు మోడీ మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. జనవరిలో అమిత్‌షా పదవీకాలం పూర్తవుతున్నందున ఆలోపే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి బీజేపీని రెండోసారి అధికారంలోకి తేవాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు జరిపి సత్తా నిరూపిచుకుంటే సంఘ్‌ నుంచి ఒత్తిడి తగ్గుతుందని మోదీ, షా ద్వయం భావిస్తోందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories