ప్రాణాలు తీసిన పటాకులు

ప్రాణాలు తీసిన పటాకులు
x
Highlights

వరంగల్ అర్బన్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కళ్లు మూసి కళ్లు తెరిచే లోపు పదకొండు మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. కాశిబుగ్గ సెంటర్‌లోని...

వరంగల్ అర్బన్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కళ్లు మూసి కళ్లు తెరిచే లోపు పదకొండు మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. కాశిబుగ్గ సెంటర్‌లోని కోటిలింగాలలో ఉన్న భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పదకొండు మంది సజీవ దహనం కాగా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక దళాలు రంగంలో దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

కోటిలింగాల గుడి సమీపంలో ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో మందు గుండు పేలిన దుర్ఘటనలో సుమారు 11 మంది సజీవ దహనం అయ్యారు. 21మంది గాయపడగా, వారిలో అయిదుగురు పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో ఓ వృద్ధురాలు ఉంది. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా బాణాసంచా పేలడంతో అందులో పనిచేస్తున్నవారి శరీరాలు వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మృతదేహాలు గుర్తించేందుకు కూడా వీలు లేని దారుణ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో గోదాంలోని పరిసరాల్లో పొగలు దట్టంగా అలుముకోగా, బాణాసంచా గోదాం శ్మశానంగా మారింది.

సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రమాదం జరిగిన తీరును జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రమాదం జరగడానికి చాలా కారణాలు ఉంటాయని వాటిని ఇప్పుడే చెప్పలేమని వరంగల్ డిఎఫ్ఓ తెలిపారు. నిబంధనలను అతిక్రమించి ఫైర్ వర్క్స్ నడుపుతున్నట్లు నిర్ధారణ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

వరంగల్‌ భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌‌ అగ్నిప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories