ఎన్టీఆర్‌ కుటుంబానికి మిశ్రమ ఫలితం

ఎన్టీఆర్‌ కుటుంబానికి మిశ్రమ ఫలితం
x
Highlights

రాజకీయాలు ఆ కుటుంబానికి కొత్తేం కాదు. పార్టీ పెట్టి తెలుగునాట ప్రభంజనం సృష్టించిన ఆ ఫ్యామిలీకి గెలుపు ఓటములు అసాధారణ విషయమేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా...

రాజకీయాలు ఆ కుటుంబానికి కొత్తేం కాదు. పార్టీ పెట్టి తెలుగునాట ప్రభంజనం సృష్టించిన ఆ ఫ్యామిలీకి గెలుపు ఓటములు అసాధారణ విషయమేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఎన్నికలను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని ఏలిన ఎన్టీఆర్‌ కుటుంబం మరోసారి ప్రజల ఎదుట తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంది. 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ కుటుంబానికి చెందిన వారు ఎన్ని సీట్లలో పోటీ చేశారు..? ఎన్నింటిలో విజయం సాధించారో ఇప్పుడు చూద్దాం.

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆంధ్ర దేశాన ప్రభంజనం సృష్టించిన తెలుగోడు అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి కనీవిని ఎరుగని రికార్డు సృష్టించారు. అలాంటి ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి వచ్చిన ఆయన వారసులు ఈ సారి ఎన్నికల్లో చూపించిన ప్రభావం అంతంత మాత్రమే. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం తాజా ఎన్నికల్లో ఘోరంగా పరాజయాన్ని అందుకుంది. అయితే ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి మాత్రం విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళీపై 29 వేల 981 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఫలితాలతో పోల్చితే మెజార్టీ దాదాపు సగానికి తగ్గింది.

అలాగే చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకేశ్ తొలిసారి ఎన్నికల్లోనే ఓటమి పాలయ్యారు. మంగళగిరి నుంచి బరిలోకి దిగిన ఆయన విజయం వాకిట బోర్లాపడ్డారు. ఆఖ‌రు వరకు ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి, లోకేశ్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగింది. విజయం ఎవరివైపు అన్నది టెన్షన్‌గా మారింది. చివరకు లోకేశ్‌ ఓటమి పాలయ్యారు.

హిందూపురం టీడీపీకి కంచుకోట అని మరోసారి రుజువైంది. నందమూరి నటసింహం ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణను హిందూపురం ప్రజలు వరుసగా రెండోసారి అక్కున చేర్చుకున్నారు. సమీప ప్రత్యర్థి వైసీపీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌ పై 17 వేల 29 ఓట్ల తేడాతో విజయం అందుకున్నారు.

ఇక బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిచారు. రాజకీయాలకు కొత్తైనా అక్కడి ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న కారణంగా శ్రీభరత్‌పై టీడీపీ నమ్మకంతో నిలబెట్టింది. అయితే వైసీపీ సునామీలో శ్రీభరత్‌ కూడా ఓటమిని చవిచూశారు.

ఇదే విశాఖ పార్లమెంట్‌ నుంచి ఎన్టీఆర్‌ కూతరు బీజేపీ నుంచి పురందేశ్వరి బరిలో నిల్చారు. గతంలో కాంగ్రెస్‌ తరపున ఇదే లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించి కేంద్రమంత్రిగా పని చేశారు. అయితే ఈ సారి ఆమె గెలుపుపై ఆశలు పెట్టుకున్నా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు.

మరోవైపు ప్రకాశం జిల్లా పర్చూరు వైసీపీ అభ్యర్థి, ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి భర్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఓటమి పాలయ్యారు. తన భార్య పురందేశ్వరి బీజేపీలో ఉన్నా తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరిన ఆయన అనూహ్యంగా పర్చూరు అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చింది. అయితే ఆఖరు వరకు పోటీ ఇచ్చిన ఆయన చివరికి చేతులెత్తేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories