Gautam Adani: ప్రపంచ రెండో కుబేరుడిగా అదానీ

Gautam Adani becomes worlds second-richest person
x

Gautam Adani: ప్రపంచ రెండో కుబేరుడిగా అదానీ

Highlights

Gautam Adani: 15,570 కోట్ల డాలర్లకు చేరిన అదానీ సంపద

Gautam Adani: నికర సంపదలో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ (Gautam Adani).. తాజాగా ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరారు. సంపద విలువ పరంగా ఆయన కంటే ముందు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మాత్రమే ఉన్నారని ఫోర్బ్స్‌ రియల్‌-టైమ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడిస్తోంది. అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి అదానీ (Gautam Adani) రెండో స్థానానికి ఎగబాకారు. ఈ స్థాయికి చేరిన తొలి భారత, ఆసియా వ్యక్తి అదానీయే . స్టాక్‌ మార్కెట్‌ కదలికలకు అనుగుణంగా కుబేరుల సంపద ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జాబితాలోని వ్యక్తుల స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.

ఫోర్బ్స్‌ వివరాల ప్రకారం అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీ షేర్లు శుక్రవారం రాణిస్తున్నాయి. దీంతో ఆయన సంపద 5.5 బిలియన్‌ డాలర్లు పెరిగింది. 155.7 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరారు. విలాస వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 155.2 బి.డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. జెఫ్‌ బెజోస్‌ 149.7 బి.డాలర్లతో నాలుగో స్థానానికి చేరారు. భారత్‌కు చెందిన మరో కుబేరుడు ముకేశ్‌ అంబానీ ఈ జాబితాలో 92.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచారు.

గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ గ్రూప్‌లోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.20.11 లక్షల కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్‌లో మొత్తం 7 కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. వీటిలో నాలుగు సంస్థల షేరు ధర ఈ కేలండర్‌ ఏడాదిలో రెండింతలకు పైగా పెరిగింది. ఈ ఏడాది అదానీ సంపద 72 బిలియన్‌ డాలర్లకు పైగా ఎగబాకింది. తొలి పది మంది కుబేరుల్లో 2022లో అదానీ, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద మాత్రమే పెరగడం విశేషం.

అయితే, బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలో మాత్రం గౌతమ్‌ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. ఈ సూచీ గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి ఉన్న విలువను పరిగణనలోకి తీసుకుంది. మార్చిలో రెగ్యులేటరీలకు సమర్పించిన వివరాల ప్రకారం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్స్‌లో గౌతమ్‌ అదానీకి 75 శాతం వాటాలున్నాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌లో 37 శాతం, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లో 65 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీలో 61 శాతం వాటాలు ఆయన పేరిట ఉన్నాయి.

వజ్రాల ట్రేడింగ్‌ నుంచి కళాశాల చదువును మధ్యలోనే ఆపేసిన అదానీ, తొలుత వజ్రాల ట్రేడింగ్‌ చేశారు. బొగ్గు వ్యాపారిగా మారాకే ఆయన దశ తిరిగింది. బొగ్గు గనులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, డేటా కేంద్రాలు, విద్యుదుత్పత్తి, సిటీగ్యాస్‌ పంపిణీ, సిమెంటు తయారీ రంగాలకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి, సంపద విలువను అనూహ్యంగా పెంచుకున్నారు. అదానీ గ్రూప్‌నకు చెందిన కొన్ని షేర్లు 2020 నుంచే 1000 శాతానికి పైగా లాభాలు అందించాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అదానీ అవతరించారు. ఏప్రిల్‌ కల్లా సంపద విలువ 100 బిలియన్‌ డాలర్లకు చేరడంతో, మైక్రోసాఫ్ట్‌ అధిపతి బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానానికి చేరారు. జెఫ్‌ బెజోస్‌, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ను అధిగమించి ఇపుడు రెండో స్థానానికి చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories