సామాన్యులపై పెనుభారం మోపేందుకు కేంద్ర ప్లాన్‌..

సామాన్యులపై పెనుభారం మోపేందుకు కేంద్ర ప్లాన్‌..
x
జీఎస్టీ
Highlights

చలికాలంలోనూ ధరలు మండిపోతున్నాయి. ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంటే కూరగాయలు, ఇతర నిత్యవసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలా, అధిక ధరలతో సామాన్యులు...

చలికాలంలోనూ ధరలు మండిపోతున్నాయి. ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంటే కూరగాయలు, ఇతర నిత్యవసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలా, అధిక ధరలతో సామాన్యులు అల్లాడిపోతుంటే మరింత పెను భారం మోపేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఆశించినమేర ఆదాయం రాకపోవడంతో జీఎస్టీ రేట్లను పెంచేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతమున్న నాలుగు జీఎస్టీ స్లాబులను మూడింటికి కుదించడంతోపాటు సామాన్యులపై మోయలేని భారం వేసేందుకు రెడీ అవుతోంది.

ధరాభారంతో సామాన్యులు నలిగిపోతుంటే మరింత పెనుభారం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పన్ను ఆదాయ లోటును పూడ్చుకునేందుకు జీఎస్టీ రేట్ల పెంపు వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతమున్న జీఎస్టీ స్లాబ్స్‌ను కుదించి రేట్లను పెంచేందుకు వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం చొప్పున జీఎస్టీ స్లాబ్స్ ఉండగా, వాటిని మూడింటికి కుదించి 8, 18, 28 శాతం చొప్పున అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన డిసెంబర్ 18న జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో స్లాబ్స్ కుదింపు రేట్ల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంటే, ప్రస్తుతమున్న 5 పర్సంటేజ్ స్లాబ్‌ను 3శాతం పెంచి 8 చేయడం అలాగే, 12శాతం స్లాబ్‌ను ఎత్తివేసి దాన్ని 18లో విలీనం చేయనున్నారు. ఇక, చివరిదైన 28శాతం స్లాబ్‌‌ను యథాతథంగా ఉంచి సెస్‌ పెంచనున్నారు.

2017 జులై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీతో కేంద్రం ఆశించినమేర ఆదాయం రావడం లేదు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జీఎస్టీ ఆదాయం అనుకున్నదాని కంటే 40 శాతం తగ్గింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 5లక్షల 26వేల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా కేవలం 3లక్షల 28వేల 365కోట్లు మాత్రమే వచ్చింది. ఇలా 2017 నుంచి ఇప్పటివరకు నిర్దేశించుకున్న లక్ష్యాలను కేంద్రం అందుకోలేకపోతోంది. దాంతో, ఆయా రాష్ట్రాలకు ఏర్పడ్డ ఆదాయ లోటును పూడ్చేందుకు వీలుగా కేంద్రం గరిష్ట పన్ను స్లాబ్‌కు అదనంగా పరిహారం సుంకం వసూలు చేస్తోంది. అయితే, ఆ పరిహారాన్ని పెంచాలని పలు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. దాంతో, సెస్ అండ్ జీఎస్టీ స్లాబ్స్‌‌ను పెంచి మరికొన్ని వస్తువులను కూడా చేర్చే అవకాశం కనిపిస్తోంది.

అయితే, కనిష్ట పన్ను స్లాబు 5శాతాన్ని 8శాతానికి పెంచితే అదనంగా 3వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా. కానీ, ఈ స్లాబ్ రేటును పెంచితే నిత్యవసర ధరలు మరింత పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ఆహారోత్పత్తులు, సామాన్యులు వినియోగించే వస్తువుల ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే, జీఎస్టీ ఆదాయం పెంచుకునేందుకు హెల్త్ కేర్ రంగాన్ని 18పర్సంటేజ్ స్లాబ్‌లోకి చేర్చే అవకాశం కనిపిస్తోంది. దాంతో, సామాన్యులపై పెనుభారం పడుతుందని చెబుతున్నారు. అలాగే, మొబైల్స్ ఫోన్స్ పైనా జీఎస్టీ రేట్లు పెంచాలని కేంద్రం చూస్తోంది.

ఆర్ధిక మందగమనంతోపాటు మార్కెట్లో గిరాకీ తగ్గిన కారణంగా జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. దాంతో, జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోవడమే కాక, పలు రాష్ట్రాలకు పన్ను పరిహారం చెల్లింపులు పెండింగ్ లో పడ్డాయి. మరోవైపు, ఆదాయం కోసం జీఎస్టీ రేట్లు పెంచాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో, అదనపు ఆదాయం కోసం జీఎస్టీ రేట్లు పెంచడం తప్ప మరో మార్గం లేదని మోడీ సర్కారు భావిస్తోందని అంటున్నారు. ప్రస్తుతమున్న నాలుగు స్లాబులను మూడింటికి కుదించడంతోపాటు రేట్లు పెంచడం అలాగే జీఎస్టీకి అదనంగా విధించే సుంకాన్ని కూడా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories