ఏపీలో ముదిరిన ముందస్తు రాజకీయం

Submitted by lakshman on Tue, 09/12/2017 - 21:09

ఆంధ్రప్రదేశ్ రాజకీయం ముందస్తు ఎన్నికల వైపు పరుగులు తీస్తోందా? 2018 డిసెంబర్‌లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయా? ఏపీలో అధికారప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయా? ఏపీలో తాజా రాజకీయాలను గమనిస్తే అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నాయేమోనన్న సందేహం కలగక మానదు. చంద్రబాబు ఇంటింటికి తెలుగుదేశం పేరుతో కింది స్థాయి కార్యకర్తల నుంచి మంత్రుల దాకా అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ కూడా ప్రతీ ఒక్కరినీ వైఎస్సార్ కుటుంబంలో భాగస్వామ్యులను చేయాలని కింది స్థాయి కార్యకర్తలకు, పార్టీ ముఖ్య నేతలకు పిలుపునిచ్చారు.

ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ కార్యకర్తలనుద్దేశించి పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలు తథ్యమన్న భావనను ప్రజలలో కలిగిస్తున్నాయి. నాలుగు సర్వేలను స్టడీ చేసి పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇస్తానని.. అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రతీ అభ్యర్థి కృషి చేయాలని చంద్రబాబు ఇటీవల నిర్వహించిన భేటీలో నేతలకు స్పష్టం చేశారు. 2018 డిసెంబర్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశముందని.. అందరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. వైఎస్ జగన్ కూడా గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 

ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి.. ఎప్పటికప్పుడు వైసీపీ అధినాయకత్వానికి నివేదికలు పంపుతోంది. దీంతో ఇరు పార్టీల సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిని టికెట్ దక్కుతుందో... దక్కదోనన్న భయం వెంటాడుతోంది. నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. అందులో భాగంగానే అక్టోబర్ నుంచి స్వయంగా అన్నీ తానై పాదయాత్ర చేయడానికి జగన్ సంకల్పించారు. తన తండ్రి వైఎస్ మాదిరిగా ఇంటింటికీ వెళ్లి వారి కష్టాలను తెలుసుకుని.. తానున్నానని ధైర్యం చెప్పేందుకు జగన్ సిద్ధమయ్యారు.

వైఎస్‌ఆర్ పాదయాత్రతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినట్లుగానే.. జగన్ చేసే పాదయాత్ర కూడా వైసీపీకి అధికారం కట్టబెడుతుందని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇక అధికార టీడీపీ మాత్రం మళ్లీ తమదే అధికారం అనే ధీమాతో ఉంది. ఏపీ అభివృద్ధి చెందాలంటే అది ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీలతో పోల్చుకుంటే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన మాత్రం పూర్తిగా వెనకబడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ఓట్లు రాలవన్న విషయాన్ని పవన్ గ్రహించాలని సూచిస్తున్నారు. ఇలా మొత్తం మీద ఏపీలో ముందస్తు ఎన్నికల హడావుడి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాజకీయ వేడిని రోజురోజుకూ పెంచుతోంది.

English Title
ap politic were becoming hot

MORE FROM AUTHOR

RELATED ARTICLES