టీఆర్ఎస్‌లో సైలెంటైన నాయిని.. మౌనానికి కారణమేంటి?

టీఆర్ఎస్‌లో సైలెంటైన నాయిని.. మౌనానికి కారణమేంటి?
x
నాయిని నర్సింహారెడ్డి
Highlights

టిఆర్ఎస్‌లో ఓ సీనియర్ నాయకుడు పార్టీకి దూరం అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని నెలలుగా పార్టీ అధినేతపై, ఆ లీడర్ అసంతృప్తిగా ఉన్నారనే...

టిఆర్ఎస్‌లో ఓ సీనియర్ నాయకుడు పార్టీకి దూరం అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని నెలలుగా పార్టీ అధినేతపై, ఆ లీడర్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తన సన్నిహితులతో వాపోతున్నారట. ఇంతకీ ఎవరాయన?

తెలంగాణ రాష్ట్ర సమితిలో పరిచయం అక్కర్లేని పేరు నాయిని నర్సింహారెడ్డి. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసిఆర్‌తో కలిసి నడిచిన అతికొద్ది మందిలో ఒకరు నాయిని. కేసిఆర్ ఎక్కడ మాట్లాడినా ఆయన పక్కనే ఉండే వారు నాయిని. కేసిఆర్‌తో బహిరంగ సభల్లో ఎక్కువగా పాల్గొన్నవారిలో ఆ‍యనొకరు. కార్మిక సంఘాల నాయకుడిగా ఎంతో పేరున్న నాయినిని, వెంటపెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పోరాడారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేబినెట్‌లో నెంబర్‌ టు స్థానంలాంటి హోంమంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. నాయినిని అన్నా అని పిలిచే కేసీఆర్‌, ఆ‍యన పెద్దరికానికి అంతగా ప్రాధాన్యమిచ్చారు. అలా కేసీఆర్‌తో నిత్యం వెంటనడిచిన నాయిని నర్సింహారెడ్డి, ఇప్పుడు ఎక్కడా కనపడ్డం లేదు. ఆయన వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. అసలాయన పార్టీలో వున్నారా లేరా అన్న సందేహాలు కూడా కొందరు వెలిబుచ్చుతున్నారంటే, పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఉద్యమకాలం నుంచి దృఢంగా అల్లుకున్న కేసీఆర్‌-నాయిని బంధానికి 2018లో బీటలుపడ్డాయన్న మాటలు వినపడ్డాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో నాయినికి ముషీరాబాద్ టికెట్ ఇవ్వలేదు. తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కోసం కూడా చివరి వరకూ ప్రయత్నించారు. రెస్సాన్స్‌ రానందుకు అలిగారు కూడా. ముఖ్యమంత్రి బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. అయితే పార్టీకి నాయిని సేవలు వాడుకోవాలనుకున్నారు. కాని ఇప్పటి వరకు నాయినికి ఎలాంటి పార్టీ పదవి రాలేదు. నాయినికి ఎమ్మెల్సీ పదవి ఉంది. అది కూడా మరో నాలుగు నెలల్లో పూర్తవుతోంది. మరి రెన్యువల్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు, నాయిని వర్గంలో మరోసారి అలజడికి కారణమవుతోంది.

కొద్ది రోజులుగా నాయిని సైలెంట్‌గా ఉంటున్నారు. తన అల్లుడికి టికెట్ ఇవ్వలేదు, తనకు పార్టీలో కీలక పదవి ఇస్తామని అది కూడా లేదు అని తన సన్నిహితులతో వాపోతున్నారట. కొన్నిసార్లు కేసీఆర్‌పైనా పరోక్ష విమర్శలు చేశారు. మొన్న ఆర్టీసీ యూనియన్లు వద్దూ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడారు. యూనియన్లు లేకపోతే కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకునేవారే ఉండరని అన్నారు. ఇలా అప్పుడప్పుడు తనలో గూడుకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతూనే వున్నారు నాయిని నర్సింహారెడ్డి.

టీఆర్ఎస్‌ అధినేత తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అసంతృప్తితో వున్న నాయిని, కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వీడుతున్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దాదాపు రాజకీయ ముదిమి వయసులో వున్న నాయిని, ఇప్పటికిప్పుడు పార్టీ మారినా ప్రయోజనంలేదని కొందరంటున్నారు. అంతేకాదు, తన అల్లుడిని సైతం చక్కదిద్దాలన్నా పార్టీలోనే వుండాలి. అందుకే నాయిని గట్టిగా విమర్శలు చేయలేకపోతున్నారని ఆయన వర్గీయులు కొందరంటున్నారు. చూడాలి, నాయిని మున్ముందు ఎలాంటి అడుగులు వేస్తారో నాయిని పట్ల పార్టీ అధిష్టానం ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories