వేసవిలో రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లు

Indian Railways Announces Summer Special Trains
x

వేసవిలో రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లు

Highlights

Trains: ఏప్రిల్ 15 నుంచి జూన్ 24 వరకూ ప్రత్యేక రైళ‌్లు

Trains: వేసవి సెలవుల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. వేసవిలో రద్దీ దృష్ట్యా దేశ వ్యాప్తంగా 9 వేల 111 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తెలుస్తుంది. ఇది గతేడాది కంటే 2 వేల 742 ట్రిప్పులు అధికమని.. రైల్వే అధికారి ప్రకటనలో తెలిపారు. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలో మొత్తం 52 సమ్మర్‌ స్పెషల్స్‌ నడుస్తుంటే.. వీటిలో వాల్తేర్‌ డివిజన్‌ మాత్రమే 12 జతల రైళ్లు నడుపుతోందని సీనియర్ అధికారి వివరించారు. డిమాండ్‌ ఉన్న మార్గాల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికుల జాబితాల ప్రామాణికతే కాకుండా వివిధ మీడియా రిపోర్టులు, సోషల్‌ మీడియా నివేదికలు, రైల్వే హెల్ప్‌లైన్‌ల సహకారంతో అదనపు రైళ్లను నడపడానికి సిద్ధమైనట్టు తెలిపారు.

వేసవిలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్, మే రెండు నెలల్లో 1,079 ప్రత్యేక రైలు సేవలను ప్రకటించింది. ఉత్తర, తూర్పు దిశలలో ఉన్న సికింద్రాబాద్ - దానాపూర్ , హైదరాబాద్ - గోరఖ్‌పూర్, కాచిగూడ - కొచ్చువేలి, సికింద్రాబాద్ - అగర్తల , సికింద్రాబాద్ - సంత్రాగచ్చి , సికింద్రాబాద్ - షాలిమార్ , సికింద్రాబాద్ - పట్నా, తిరుపతి – షిర్డీ, కాచిగూడ – మధురై, సికింద్రాబాద్ - కొల్లాం, హైదరాబాద్ – కటక్, హైదరాబాద్ - రక్సాల్ మొదలైన ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు సెలవుల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికుల కోసం ముఖ్యనగరాల మధ్య ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన రైలు మార్గాల్లో రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దేశంలోని అన్ని జోన్​లలో ఈ రైల్వే సేవలు అందుబాటులో ఉంటాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, బంగాల్, బిహార్, ఉత్తర్​ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ రైళ్లను నడిపిస్తున్నారు. ముఖ్యంగా కేరళలోని కొల్లం, పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్‌, సాంత్రాగాచి లకు రైళ్లను నడుపనున్నామని వివరించారు. సికింద్రాబాద్‌-సాంత్రాగాచి రైలు ప్రతి శుక్రవారం బయలు దేరడంతో పాటు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని తెలిపారు. అలాగే ప్రతి శనివారం తిరుగు ప్రయాణమయ్యే విధంగా షెడ్యూల్ చేసినట్టు వివరించారు. ఈ రైలు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడలో ఆగుతుందని తెలిపారు. ఏపీలో చూసుకుంటే.. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్‌, కటక్‌, ఖరగ్‌పూర్‌ మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయని అధికారులు వెల్లడించారు. ఇక కాచిగూడ నుంచి రాయలసీమకు ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్‌ -షాలిమార్‌ ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచే నడిపిస్తున్నట్టు వివరించారు. జూన్‌ 24వ తేదీ వరకు ప్రతి సోమవారం ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్‌ -కొల్లం మధ్య ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 17 నుంచే ప్రారంభించామని.. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుందన్నారు. తిరుగు ప్రయాణంలోనూ అదే రెండు రోజుల వ్యవధిలో ఉంటుందన్నారు. ఈ రైలు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు.

వీటితో పాటు సికింద్రాబాద్ - తిరుపతి, లింగంపల్లి - కాకినాడ, హైదరాబాద్ - నర్సాపూర్, తిరుపతి - విశాఖపట్నం, సికింద్రాబాద్ - విశాఖపట్నం, మధ్య రోజు నడిచే రైళ్లు కాకుండా.. ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కార్యాచరణ చేపట్టింది. ప్రయాగ్‌రాజ్, వారణాసి, దానాపూర్ స్టేషన్ల మీదుగా ప్రయాణించే వారు భారీ సంఖ్యలో సాధారణ కోచ్‌లలో ప్రయాణం చేస్తుంటారు. దక్షిణ మధ్య రైల్వే కూడా సాధారణ కోచ్​లలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం దానాపూర్ వైపు 22 అన్‌రిజర్వ్‌డ్ వీక్లీ స్పెషల్ రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు పూర్తిగా రిజర్వ్ చేయని కోచ్‌లను కలిగి ఉంటాయని, సెలవుల్లో ఈ ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసే దిగువ మధ్యతరగతి, శ్రామిక్ కార్మికులు, తీర్థ యాత్రలు చేసే ప్రయాణీకులకు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

వేసవిని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన, ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో మంచి నీటి సరఫరాపై దృష్టిసారించింది. రద్దీ నియంత్రణ కోసం విస్తృత వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్లలో అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, క్రమపద్ధతిలో రద్దీని నియంత్రించడానికి సీనియర్ అధికారులను నియమించారు. భారీ రద్దీ ఉండే సమయంలో తొక్కిసలాట తలెత్తకుండా గుంపును అదుపు చేయడం కోసం గవర్నమెంట్ రైల్వే పోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లకు చెందిన సిబ్బందిని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్​ల వద్ద అందుబాటులో ఉంచామని అధికారులు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories