అద్దంకిలో అధికార పార్టీ కొత్త ప్లాన్.. సిట్టింగ్ ఎమ్మెల్యే రవికుమార్‌ను ఓడించే ఎత్తుగడ..

AP CM Jagan Focus on Addanki Constituency
x

అద్దంకిలో అధికార పార్టీ కొత్త ప్లాన్.. సిట్టింగ్ ఎమ్మెల్యే రవికుమార్‌ను ఓడించే ఎత్తుగడ..

Highlights

Addanki: రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నా ఆ నియోజకవర్గంలో రాజకీయం మాత్రం నిప్పుల కొలిమిలా ఎప్పుడూ మండుతూనే ఉంటుంది.

Addanki: రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నా ఆ నియోజకవర్గంలో రాజకీయం మాత్రం నిప్పుల కొలిమిలా ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. పార్టీ ఏదైనా సరే ఆ నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం. నియోజకవర్గంలో రాజకీయమంతా ఆయన కనుసన్నుల్లోనే జరుగుతాయ్. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ పార్టీ గాలిలోనూ ఆ నియోజకవర్గంలో ఆయన అఖండ విజయం సాధించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఈ నియోజకవర్గంలో మాత్రం ఆయన మాటే ఫైనల్. నిత్యం నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ సమస్యలు పరిష్కరిస్తూ అందరివాడులా నిలుస్తాడు ఆ నాయకుడు. టీడీపీలో కీలక నేతగా ఉంటున్న ఆ నేతను ఇప్పుడు వైసీపీ టార్గెట్ చేస్తోంది.

ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం పేరు వింటేనే ఫ్యాక్షన్ రాజకీయాలు గుర్తుకొస్తాయ్. రాజకీయాల్లో ఫ్యాక్షన్ కనిపించనప్పటికీ ప్రత్యర్ధిని దెబ్బ కొట్టేందుకు చాప కింద నీరులా ఒకరికి తెలియకుండా మరొకరు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టండంటూ అధికార పార్టీ ముఖ్యలకు సీఎం జగన్ ఆదేశించారంటే ఆ ఎమ్మెల్యే అధికార పార్టీకి అంతగా కొరకరానికొయ్యలా మారాడు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఒక్క అద్దంకిపైనే సీఎం ఎందుకు దృష్టి పెట్టాడన్నదానిపై ఇప్పుడు వైసీపీ, టీడీపీలో చర్చ సాగుతోంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న ఆయనను పడగొట్టేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగడం జిల్లాలో హాట్ టాపిక్ మారింది.

హ్యాట్రిక్ శాసన సభ్యుడుగా జనం నాడి తెలిసిన గొట్టిపాటి రవికుమార్ వరుస విజయాలకు చెక్ పెట్టేందుకు అధికార పార్టీ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇంతకీ ఆ కొత్త ఎత్తుగడ ఏంటన్నదానిపై అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. గొట్టిపాటికి చెక్ చెప్పాలన్న పట్టుదలకు సీఎం జగన్ ఎందుకు వచ్చారన్నదానిపై నేతలు తెగ మాట్లాడుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి హవాకు తిరుగులేదు. ఈ విషయం టీడీపీ కంటే అధికార వైసీపీ నేతలకు చాలా బాగా తెలుసు. ఓటమి తెలియని నేతగా రవికుమార్ జిల్లాలోనే ఫేమస్ అయ్యారు. ఒకసారి మార్టూరు నుంచి, మూడు సార్లు అద్దంకి నుంచి గెలిచి బలాన్ని చాటుకున్నారు. మొదట్లో వైసీపీలో ఉన్నా తర్వాత తెలుగుదేశంలో చేరి వైసీపీ ప్రభంజనంలోనూ అద్దంకిలో సూపర్ విక్టరీ సాధించారు.

అందరి అంచనాలను తారుమారు చేస్తూ అఖండ విజయం సాధించిన రవికుమార్ కు జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇబ్బందులు మొదలయ్యాయ్. రవికుమార్ వ్యాపారాలకు అధికారపక్షం నుంచి సమస్యలు ఎక్కువయ్యాయ్. గనులు లీజ్ విషయంలో సర్కారు రవికుమార్ కు ఇబ్బందులు ఎదురయ్యాయ్. టీడీపీ కేడర్‌ను సైతం వేధింపులకు గురయ్యారు. పనులు చేయకుండా ఆటంకాలు కలిగాయ్. ప్రభుత్వం నుంచి ఎంతలా ఒత్తిడి ఎదురైనా రవి కుమార్ మాత్రం అదర లేదు. బెదర లేదు. అధికార పార్టీ నుంచి వేధింపులు ఎంత ఎక్కువైనా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారితోనే రాజకీయమన్నట్టుగా గొట్టిపాటి ముందుకు సాగారు.

గొట్టిపాటికి పోటీగా ప్రముఖ గ్రానైట్ వ్యాపారి ఒకప్పటి తెలుగుదేశం పార్టీ సహచరుడు, మాజీ మంత్రి నేడు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న బడా పారిశ్రామికవేత్త శిద్దా రాఘవరావును అద్దంకి నుంచి బరిలోకి నిలపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసినా గొట్టిపాటి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. సొంత పార్టీ నుంచి సైతం గొట్టిపాటికి అదే విధంగా ప్రాధాన్యత లభిస్తుండటంతో నియోజకవర్గంపై పూర్తి ఫోకస్ పెట్టాడు రవికుమార్.

వచ్చే ఎన్నికల్లో రవికుమార్‌ను ఓడించాలని అధికార పార్టీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. 2014 ఎన్నికల తర్వాత అప్పటి పరిస్దితులకు అనుగుణంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు. వారిలో గొట్టిపాటి రవికుమార్ మాత్రమే 2019 ఎన్నికలలో గెలుపొందారు. అందరూ ఓటమి చెందినా గొట్టిపాటి మాత్రం నియోజకవర్గంలో ఉన్న బలంతో తిరిగి గెలవడంతో వైసీపీ అధినేత జగన్ అసలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే వచ్చే ఎన్నికల్లో గొట్టిపాటికి చెక్ పెట్టి తీరాల్సిందేనంటున్నారు సీఎం జగన్. అద్దంకిలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి స్థితిలో రవికుమార్‌కు చెక్ పెట్టాల్సిందేనని మంత్రి బాలినేనికి సీఎం జగన్ హుకుం జారీ చేశారంటున్నారు నేతలు.

ఇందులో భాగంగానే ఆర్ధిక బలం ఉన్న మాజీ మంత్రి సిధ్దా రాఘవరావు బరిలోకి దించాలని అధికార పార్టీ వ్యూహరచన చేస్తోంది. గొట్టిపాటిది జనబలం అయితే శిద్దా రాఘవరావుది ధన బలం... జనబలాన్ని... ధన బలంతో దెబ్బ కొట్టాలని అధికార పార్టీ ఎత్తుగడ వేస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీలో చేరిన శిద్దాను ఎక్కడి నుంచి బరిలోకి దించాలని భావిస్తున్న పార్టీకి ఇప్పుడు శిద్దా కన్పిస్తున్నాడు. రవికుమార్‌ను ఆర్థికంగా ఢీకొట్టగల సత్తా శిద్దాకు మాత్రమే ఉందని అందుకే ఆయననే బరిలో దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అంతేకాక శిద్దాను పోటీలోకి దించడానికి జిల్లాలో ఎక్కడా ఖాళీ లేకపోవడంతో అద్దంకి నుంచి బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది.

అద్దంకి వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న బాచిన కృష్ణచైతన్య రవికుమార్‌కు ధీటైన పోటీ కాదని పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. గొట్టిపాటి రవికుమార్ విషయానికి వస్తే ఈ సారి కూడా తెలుగుదేశం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ వేవ్‌లోనే విజయం సాధించిన గొట్టిపాటి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం ఖాయమంటున్నారు టీడీపీ కార్యకర్తలు. రవికుమార్ గెలుపును అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా ఉన్నదీ పోయిందీ ఉంచుకున్నదీ పోయింది అన్న చందం అవుతుందా అన్న చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories